ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ విలువ ఇప్పుడు రూ.50 వేల కోట్లకు పైమాటే! ఒక్కో ఫ్రాంఛైజీ విలువ వందలు, వేల కోట్లకు చేరిపోయింది! లీగ్ ఆరంభమైనపుడు అది ఈ స్థాయికి చేరుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ కూడా భవిష్యత్తులో తమ విలువ భారీ స్థాయికి చేరుతుందని ఊహించినట్లు లేదు. ప్రస్తుతం ఆ ప్రాంఛైజీ మార్కెట్ విలువ 14 వందల కోట్ల పైమాటే అని క్రీడావర్గాల సమాచారం.
వార్న్ దశ తిరిగింది..!
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఐపీఎల్‌లో తమ జట్టుకు కెప్టెన్సీతో పాటు కోచ్ బాధ్యతలూ నిర్వర్తించడానికి సిద్ధమైన షేన్ వార్న్‌కు... అప్పట్లో రాయల్స్ రూ.4.6 కోట్ల చొప్పున వార్షిక వేతనంతో పాటు ఫ్రాంఛైజీలో వాటా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏడాదికి 0.75 శాతం షేర్ ఇచ్చి.. వార్న్ ఎన్నేళ్లు రాయల్స్‌కు ఆడితే అన్ని 0.75 శాతాల వాటా కలుపుతూ వెళ్లేలా రాయల్స్ ఒప్పందం చేసుకుందట.
వార్న్ నాలుగేళ్లు(2008-11) రాయల్స్‌కు ఆడి ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేయగా.. అతడి మొత్తం వాటా 3 శాతం అయింది. ఈ విషయాన్ని వార్నే వెల్లడించాడు. ప్రస్తుతం రాయల్స్ విలువ దాదాపు రూ.1425 కోట్లు. ఇంకో రెండేళ్ల తర్వాత అది రెట్టింపు.. అంటే రూ.2850 కోట్లు అవుతుందని అంచనా. అందులో 3 శాతం అంటే.. వార్న్ వాటా రూ.85 కోట్లన్నమాట. ఇంత భారీ మొత్తాన్ని ఐపీఎల్ కారణంగా అందుకోనున్నాడీ ఆస్ట్రేలియా మాజీ సారథి. 2018 ఫిబ్రవరిలో ఇతడిని తమ ఐపీఎల్ జట్టుకు మెంటార్‌గా నియమించుకుంది రాయల్స్ ప్రాంఛైజీ.