కెప్టెన్ సాబ్ సంపాదన
భారత క్రికెట్ జట్టు సారథిగా తనదైన ముద్రవేశాడు విరాట్‌కోహ్లీ.కోట్లాది మందికి ఫ్యాషన్ ఐకాన్‌గానూ నిలిచాడు. ఇంకా మరెన్నో రికార్డుల్ని కూడా సొంతం చేసుకున్న కోహ్లీ బ్యాట్‌తో బరిలోకి దిగితే చాలు మైదానం చప్పట్లూ ఈలలతో హోరెత్తిపోతుంది. అందుకే ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంది ఎమ్‌ఆర్‌ఎఫ్ టైర్ల సంస్థ. కోహ్లీ బ్యాట్లపై తమ సంస్థ స్టిక్కర్లు వేసుకోవడానికి పదేళ్లకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకోసం కోహ్లీకి ఆ సంస్థ ఏడాదికి రూ.8 కోట్లు ఇస్తోంది. అలానే షూలూ, మరికొన్ని బ్రాండింగుల ద్వారా మైదానంలో మరో రెండు కోట్లు కూడా వెనకేసుకుంటున్నాడు ఈ మేటి బ్యాట్స్‌మన్.
కూల్ కూల్‌గా కోట్లు...
టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ పట్టాడంటే ప్రత్యర్థులకు ముచ్చెమటలే. హెలికాప్టర్ షాట్ లాంటి వాటిని పిడుగుల్లా కురిపించే ధోని బ్యాట్ మీద పలు కార్పొరేట్ సంస్థలు తమ లోగోలతో ప్రచారం చేయించుకుంటున్నాయి. ప్రస్తుతం రీబక్‌తో పాటు స్పార్టన్ అనే రేసింగ్ సంస్థ స్టిక్కర్లు ధోనీ బ్యాట్‌పైన కనిపిస్తున్నాయి. అందుకుగానూ మహి ఏడాదికి ఆరు కోట్లు తీసుకుంటున్నాడు.
హిట్‌మ్యాన్ స్టిక్కరేస్తే..
భారత ఓపెనర్, వన్డే టీం వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ పవర్ తెలిసిందే. కెప్టెన్‌గానూ విజయవంతమైన రోహిత్.. భారత జట్టుకు 2018లో ఆసియా కప్‌నూ, ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌నూ సాధించి పెట్టాడు. బంతిని స్టాండ్స్‌లోకి పంపడంలో తిరుగులేని ఇతని బ్యాట్‌పై సియట్ టైర్ల సంస్థ స్టిక్కర్లు వేసి తమ బ్రాండ్‌కు ప్రచారం కల్పించుకుంటోంది. దీనికిగానూ ఏడాదికి మూడు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది.
జింక్స్ పవర్
ఎన్ని గంటలు ఆడినా ఏమాత్రం అలసిపోని బ్యాట్స్‌మన్ అజింక్య రహానె. ఈ టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్‌్్స మన్‌గా చాలాసార్లు ఆపద్భాందవ పాత్ర పోషించిన రహానే ఇదివరకు ప్యూమా, నైకి బ్రాండ్‌ల స్టిక్కర్లను బ్యాట్‌పైన వేసుకునేవాడు. ప్రస్తుతం సియట్ సంస్థతో ఒప్పందం చేసుకుని ఏడాదికి రెండు కోట్ల దాకా అందుకుంటున్నాడు.
లాక్‌డౌన్‌లోనూ లక్షలు
టీమ్ ఇండియా ఓపెనర్, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ శిఖర్‌ధావన్. బెదురులేని ఆటతీరుతో ఆకట్టుకునే ఈ మేటి క్రికెటర్‌తో ఎమ్‌ఆర్‌ఎఫ్ సంస్థ మూడు కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందుకే శిఖర్ బ్యాట్‌పై ఎప్పుడూ ఆ సంస్థ లోగో దర్శనమిస్తుంది. ఈ లాక్‌డౌన్‌లోనూ సోషల్ మీడియాలో ఏరియల్, బోట్, కుర్‌కురే సంస్థల స్టిక్కర్లతో కనిపించి ఇంకొంత ఆదాయాన్నీ సంపాదించాడు ధావన్.