సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ కెప్టెన్సీపై తానెప్పుడు సందేహపడలేదని అన్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్. విరాట్ నాయకత్వంలో టీమ్ఇండియా ఎప్పటికప్పుడు మరింత మెరుగవుతూనే ఉంటుందని తెలిపాడు. కోహ్లీ జట్టును ముందుకు నడిపించగల సమర్థవంతమైన నాయకుడని కితాబిచ్చాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై రహానె సారథ్యంలో భారత జట్టు చారిత్రక విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌లో అతడికి సారథి పగ్గాలు అప్పజెప్పాలని వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ స్పందించాడు.
"టీ20లో కోహ్లీ కెప్టెన్సీపై నాకెప్పుడు సందేహాలు ఉంటాయి. కానీ వన్డే, టెస్టు ఫార్మాట్లపై మాత్రం ఎలాంటి అనుమానాలు లేవు. ముఖ్యంగా టెస్టుల్లో అసలే లేదు. ఎందుకంటే విరాట్ నాయకత్వంలో టీమ్ఇండియా పరిణితి సాధిస్తూ మెరుగుపడుతుంది. అదే విధంగా బాగా రాణించగలగుతోంది. అతడు ఈ ఫార్మాట్లో అద్భుతంగా ఆడతాడు. తన సారథ్యంలో జట్టులోని ప్రతి ఆటగాడు సంతోషంగా ఉన్నాడు."
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
కోహ్లీ దంపతులకు ఇటీవల ఓ ఆడ శిశువు జన్మించింది. ఆస్ట్రేలియా తొలి టెస్టు తర్వాత జట్టుకు దూరమైన అతడు.. ఫిబ్రవరి 5న ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో తిరిగి పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ మునపటి కన్నా మరింత సంతోషంగా, ఉత్సాహంగా ఈ మ్యాచ్లు ఆడతాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. త్వరలో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చోటు సంపాదించుకునేందుకు.. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఎంత ప్రాధాన్యమో విరాట్‌కు బాగా తెలుసని చెప్పాడు.
ఇదీ చూడండి: విరుష్క జోడీ కూతురు పేరేంటంటే?