తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత ఆటగాళ్లు ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయారు. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది కోహ్లీసేన. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు బ్రేక్ అవగా.. మరికొన్ని అలానే మిగిలిపోయాయి. అయితే భారత జట్టు ఈ ఏడాదిలో చివరి టీ20 డిసెంబర్ 11న ఆడనుంది. ఇందులో అయినా ఈ రికార్డులు బ్రేక్ చేసి 2019కి ఘనమైన ముగింపు ఇస్తారేమో చూడాలి.
రోహిత్ శర్మ @ 400
అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా ఉన్న రోహిత్... ఇటీవల జరిగిన పలు టీ20ల్లో విఫలమయ్యాడు. స్వదేశంలో చివరిగా జరిగిన 9 పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌ల్లో... వరుసగా 4, 5, 12, 9, 9, 85, 2, 8, 15 మాత్రమే చేశాడు. ఇందులో ఒక్కసారే అర్ధశతకం సాధించగలిగాడు.
పొట్టిఫార్మాట్‌లో 400 సిక్సర్ల క్లబ్‌లో చేరడానికి టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ... సిక్సర్ దూరంలో మాత్రమే నిలిచాడు. హిట్‌మ్యాన్ మరో సిక్సర్ బాదితే టీ20ల్లో 400 సిక్సర్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ (534), పాక్ మాజీ ఆటగాడు షాహీద్ అఫ్రీది (476) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ 399 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
మొదటి భారతీయుడు...
టీ20లో మరో 6 పరుగులు సాధిస్తే స్వదేశంలో ఈ ఫార్మాట్‌లో వెయ్యి పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు కోహ్లీ. ఇప్పటివరకు టీ20ల్లో స్వదేశంలో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లు న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ (1430), కోలిన్ మన్రో (1000) మాత్రమే.
చాహల్ మరొక్కటి..
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కూడా అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. మరో వికెట్ సాధిస్తే పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుకెక్కుతాడు. 36 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీసిన చాహల్.. ప్రస్తుతం రవించంద్రన్ అశ్విన్‌తో సమంగా నిలిచాడు.
అగ్రస్థానం కాపాడుకుంటాడా...?
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రారాజుగా కోహ్లీ(2563) మరోసారి నిలిచాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న హిట్‌మ్యాన్(2562).. ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయాడు. గత మ్యాచ్ తర్వాత మూడు పరుగుల అంతరమే వీరిద్దరి మధ్య ఉండగా... తాజాగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో రోహిత్ 15, కోహ్లీ 19 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ జాబితాలో 2436 రన్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు గప్తిల్. 2263 రన్స్‌తో షోయబ్ మాలిక్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లో ఎవరు బాగా ఆడి మొదటి స్థానం దక్కించుకుంటారో చూడాలి.
వచ్చే ఏడాదే ప్రపంచకప్...
కరీబియన్ జట్టుతో ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డులు బ్రేక్ అవ్వకపోతే... వచ్చే ఏడాది జనవరి 5 నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. అప్పుడు లంకతో 3 టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఉంది. అక్టోబర్ నుంచి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
ప్రపంచకప్ కోసం సన్నాహాల్లో ఉన్న భారత జట్టు... ఓ చెత్త రికార్డునూ మోసుకొస్తోంది. ఛేదనలో ఘనమైన పేరున్నకోహ్లీ సేన... భారీ స్కోరును చేయడంలోనూ, దాన్ని కాపాడుకోవడంలోనూ విఫలమవుతోంది. 2018 జనవరి నుంచి 34 మ్యాచ్‌లు ఆడగా.. వాటిలోని 16 మ్యాచ్‌ల్లో తొలిసారి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. ఇందులో 8 మాత్రమే గెలిచి 8 ఓడిపోయింది. 18 మ్యాచ్‌ల్లో ఛేదనలో బరిలోకి దిగిన కోహ్లీ సేన... 14 విజయాలు, మూడు ఓటములతో ఉంది.