ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 43.3 ఓవర్లలో 159 రన్స్‌కు ఆలౌట్ అయింది కంగారూ జట్టు. నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన కార్తీక్ త్యాగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
ఫానింగ్ కాస్త భయపెట్టాడు..
మోస్తరు లక్ష్య ఛేదనలో ఆరంభ ఓవర్లోనే టపటపా వికెట్లు కోల్పోయింది ఆసీస్. పేసర్ కార్తీక్ త్యాగి దెబ్బకు 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నలుగురూ వరుసగా 0, 4, 0, 2 స్కోర్లు మాత్రమే సాధించారు. ఆ సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు మరో ఎండ్ ఓపెనర్ సామ్ ఫానింగ్. 127 బంతులాడి 75 రన్స్ చేశాడు. పాట్రిక్ రో 41 బంతుల్లో 21, స్కాట్ 75 బంతుల్లో 35 పరుగులు చేసి చక్కటి సహకారం అందించారు. భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొని కాసేపు భయపెట్టిన సామ్.. విజయానికి 79 పరుగుల దూరంలో పెవిలియన్ చేరడంతో ఆసీస్ పరాజయం ఖాయమైంది. ప్రత్యర్థిని 43.3 ఓవర్లలో 159 పరుగులకే చుట్టేశారు భారత బౌలర్లు.
యశస్వి, అథర్వ అర్ధశతకాలు...
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (62; 82 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు), అథర్వ అంకోలేకర్ (55*; 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ శతకాలతో రాణించారు.
టాప్ ఆర్డర్‌లో దివ్యాన్ష్ సక్సేనా (14), తిలక్ వర్మ (2), ప్రియమ్ గార్గ్ (5) విఫలమవ్వడం వల్ల భారత్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ (15; 48 బంతుల్లో 1 ఫోర్), సిద్దేశ్ వీర్ (25; 42 బంతుల్లో 4ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మరో వికెట్ పడకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత అథర్వ అజేయ అర్ధశతకం సాధించడం వల్ల భారత్ స్కోరు 200 దాటింది. చివర్లో రవి బిష్ణోయ్ (30; 31 బంతుల్లో 1ఫోర్, 1 సిక్సర్) సమయోచితంగా ఆడి ఆసీస్ లక్ష్యాన్ని 234కు తీసుకెళ్లాడు.