భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ జరగాలని పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు ఇటీవల కాలంలో డిమాండ్ చేస్తున్నారు. పాక్ క్రికెట్‌ను రక్షించాలంటే ఇదొక్కటే మార్గమని తెలుసుకున్న ఆ దేశ మాజీలు షోయబ్ అక్తర్, అఫ్రిది వంటి వాళ్లు ఇప్పటికే బహిరంగంగా మాట్లాడారు. బీసీసీఐ అధ్యక్షుడు రెండు దేశాల మధ్య క్రికెట్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తాజాగా పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.
దాయాదులైన భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు లేకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నిర్వహించడం అర్థరహితమని వకార్ అన్నాడు. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. ఐసీసీ మరింత చొరవ తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
"ప్రస్తుతం భారత్, పాక్ మధ్య పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్ విషయంలో ఐసీసీ మరింత చొరవ చూపాల్సింది. రెండు బోర్డుల మధ్య జోక్యం చేసుకోవాల్సింది. ఎందుకంటే నా వరకు దాయాదుల పోరు లేని ప్రపంచ ఛాంపియన్‌షిప్ అర్థరహితం. టీమిండియాపై టెస్టుల్లో అరంగేట్రం చేయడం నేను మర్చిపోలేను."
- వకార్ యూనిస్, పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా బౌలింగ్ విభాగంపైనా ప్రశంసలు కురిపించాడు వకార్. ప్రస్తుతం భారత బౌలర్లు 140 పైగా కి.మీ వేగంతో బంతులు విసురుతున్నారని.. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదని తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ టీమిండియా బౌలింగ్ దాడిని ముందుకు నడిపిస్తున్నారని అన్నాడు. వాళ్లు కఠోర సాధన చేస్తూ రాణించడం వల్లే భారత జట్టు టెస్టు సహా అన్ని ఫార్మాట్లలో మెరుస్తోందని చెప్పుకొచ్చాడు. భారత యాజమాన్యం దేశవాళీ క్రికెటర్లకు అవకాశాలివ్వడం అద్భుతమైన నిర్ణయమని కొనియాడాడు.
14 ఏళ్ల తన కెరీర్‌లో వకార్ భారత్‌పై 4 టెస్టులు మాత్రమే ఆడాడు. కెరీర్‌లో ఓవరాల్‌గా 87 టెస్టుల్లో 373 వికెట్లు.. 262 వన్డేలు ఆడిన ఇతడు 416 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.