దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 502/7 స్కోరు వద్ద డిక్లేర్ ఇచ్చింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(215), రోహిత్ శర్మ(176) శతకాలు చేయడం వల్ల టీమిండియా భారీ స్కోరు సాధించింది. ప్రొటీస్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ 3 వికెట్లు తీయగా ఫిలాండార్, డేన్, సెనురన్ ముత్తుసామి తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
202 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు వద్ద రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్లు... మరో వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 176 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 317 పరుగులు జోడించారు. హిట్‌మ్యాన్‌ను ఔట్ చేసి వీరిద్దరి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు కేశవ్ మహారాజ్.
రోహిత్ ఔటైనా మయాంక్ బ్యాటింగ్ జోరు తగ్గలేదు. నిలకడగా ఆడుతూ కెరీర్లో తొలి ద్విశతకం నమోదు చేశాడు. 358 బంతుల్లో 200 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 23 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కూడా ఇన్నే బౌండరీలు సాధించడం విశేషం.
మిగతా బ్యాట్స్మెన్లు పుజారా(6) ఫిలాండర్ బౌలింగ్‌లో ఔటవ్వగా.. కోహ్లీ(20) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వేగంగా పరుగులు చేసే క్రమంలో రహానే(15), హనుమ విహారి(10) తక్కువ పరగులకే వెనుదిరిగారు. చివర్లో జడేజా(30), సాహా(21) ధాటిగా ఆడి స్కోరు 500 దాటడంలో కీలకపాత్ర పోషించారు.
ఇదీ చదవండి: బెన్‌స్టోక్స్.. 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్'