రోహిత్ శర్మ చేసిన విలువైన సూచనల వల్లే తాను అద్భుత ఇన్నింగ్స్ ఆడానని వెల్లడించాడు టీమ్ఇండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వద్దు.. ఐపీఎల్లో లాగా స్వేచ్ఛగా నీదైనా శైలిలో బ్యాటింగ్ చేయమని రోహిత్ భాయ్ సలహా ఇచ్చాడని కిషన్ తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయాలని తపించిన ఇషాన్ కిషన్.. తన తొలి టీ20లోనే అర్థ సెంచరీ (56)తో అదరగొట్టాడు. భారత్ మ్యాచ్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు.
"ఒక క్రికెటర్‌గా నా విజయానికి చాలా మంది సాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ భాయ్ నా దగ్గరకు వచ్చి పలు సలహాలు ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్నావు.. ఎలాంటి ఒత్తిడికి లోను కావొద్దు.. ఐపీఎల్ తరహాలో నీ సహజ శైలిలో బ్యాటింగ్ చేయమని అతడు చెప్పాడు. టీమ్ఇండియా జెర్సీ ధరించినప్పుడు నీ వంతు పాత్ర పోషించాలని సూచించాడు."
-ఇషాన్ కిషన్, భారత యువ క్రికెటర్.
అండర్-19 ఆటగాళ్లైనా రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ టీమ్ఇండియాలో చోటు సంపాదించడంపై ఇషాన్ స్పందించాడు. వాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ఇది చాలా గర్వంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. రోజు రోజుకీ తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించాడు. క్రికెట్లో చాలా మంది కొత్త ఆటగాళ్లు వస్తున్నారని.. ఏ స్థానంలోనైనా ఆడటానికి తాను సిద్ధమని కిషన్ చెప్పాడు.
ఐపీఎల్లో ఆడడం కలిసొచ్చింది..
ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి అగ్రశ్రేణి బౌలర్ల బౌలింగ్‌లో ఆడటం తనకు ప్రస్తుతం కలిసొచ్చిందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడిందని తెలిపాడు.
ఇదీ చదవండి: దంచేసిన ఇషాన్- కోహ్లీ... భారత్‌దే గెలుపు