టీ20ల రాకతో గత దశాబ్దంలో టెస్టు క్రికెట్లోనూ ఎంతగానో వేగం పెరిగింది. ఆ ఫార్మాట్లో కూడా ధనాధన్ బ్యాటింగ్‌తో దూసుకెళ్తున్నారు బ్యాట్స్‌మెన్. కానీ ఇప్పటికీ నాలుగో ఇన్నింగ్స్‌లో 300 పైచిలుకు లక్ష్యం అంటే.. హడలే! అలాంటిది నాలుగు దశాబ్దాల కిందట.. ప్రపంచ అత్యుత్తమ జట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌ను దాని సొంతగడ్డపై ఎదుర్కొంటూ 438 పరుగుల భారీ లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పని చేసింది టీమిండియా. ఆడుతోంది ప్రత్యర్థి గడ్డపై అయినా.. కొండంత లక్ష్యం ముందున్నా.. ప్రత్యర్థి బౌలర్లు అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తున్నా.. అన్నింటినీ తట్టుకుని అద్భుత డబుల్ సెంచరీతో భారత్‌ను ఓ చారిత్రక విజయానికి అత్యంత చేరువగా తీసుకెళ్లాడు ఓ సాహస వీరుడు. అతనే అభిమానులు సన్నీ అని ముద్దుగా పిలుచుకునే సునీల్ గావస్కర్.
నాలుగు సెషన్ల ఆట మిగిలుంది. లక్ష్యం 438 పరుగులు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టయినా డ్రా మీదే దృష్టిపెడుతుంది. నాలుగు దశాబ్దాల కిందట అంటే చెప్పాల్సిన పనే లేదు. అప్పటి బ్యాటింగ్ వేగం ప్రకారం అయితే ఎలాగోలా నాలుగు సెషన్ల పాటు ఓవర్లను కరిగించేసి ఓటమి తప్పించుకుంటే చాలనుకుంటారు. కానీ ‘జిడ్డు’ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపున్న సన్నీ మాత్రం ఆ రోజు భిన్నంగా ఆలోచించాడు. అతనేమీ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడేయలేదు కానీ.. 50 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూనే జట్టును లక్ష్యం వైపు నడిపించాడు.టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒకానొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అనదగ్గ మేటి బ్యాటింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
నాలుగు టెస్టుల సిరీస్ కోసం 1979లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. మూడు టెస్టులు ముగిసే సరికి 0-1తో వెనుకబడింది. చివరి టెస్టులో మొదట ఇంగ్లాండ్ 305 పరుగులు చేయగా.. భారత్ 202కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను 334/8 వద్ద డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్.. భారత్ ముందు 438 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. సన్నీ మారథాన్ ఇన్నింగ్స్ (221; 443 బంతుల్లో 21×4)తో భారత్‌కు సంచలన విజయం సాధించే అవకాశం కల్పించాడు. ఒక దశలో భారత్ స్కోరు 366/1. తొమ్మిది వికెట్లు చేతిలో ఉండగా.. చేయాల్సిన పరుగులు 72 మాత్రమే. మిగిలిన ఓవర్లేమో 12. ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున చేస్తే భారత్‌కు అద్భుత విజయం దక్కుతుంది. కానీ ఆ పని చేయలేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో కెప్టెన్ వెంకట్రాఘవన్ చేసిన కొన్ని మార్పులు ప్రతికూలం కాగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ ముందు నుంచే నెమ్మదిగా ఓవర్లు వేయించి భారత్‌ను దెబ్బ తీశాడు.
చివరికి ఇన్నింగ్స్‌ను భారత్ 429/8తో ముగించింది. విజయానికి కేవలం 9 పరుగుల దూరంలో ఆగిపోయింది. అయితే ఫలితం డ్రానే అయినా సన్నీ ఇన్నింగ్స్ మాత్రం ఓ అద్భుతం. తొలి వికెట్‌కు అతను చేతన్ చౌహాన్ (80)తో 213 పరుగులు, రెండో వికెట్‌కు వెంగ్‌సర్కార్ (52)తో 153 పరుగులు జోడించి భారత్‌ను తిరుగులేని స్థితిలో నిలిపాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నపుడు ఉండే ఒత్తిడి ఏమాత్రం కనిపించనివ్వకుండా దిలాసాగా సన్నీ బ్యాటింగ్ చేసిన తీరు అపూర్వం. హెల్మెట్ లేకుండా ఫాస్ట్‌బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడతను. అమోఘమైన ఫుట్‌వర్క్‌తో కాళ్ల దగ్గర పడ్డ బంతుల్ని లెగ్ సైడ్ ఫ్లిక్ చేసిన తీరు.. హాఫ్ వ్యాలీ బంతుల్ని కవర్స్‌లో బౌండరీకి పంపిన వైనం చూసి తీరాల్సిందే.
పేసర్లు బాబ్ విల్లీస్, బోథమ్, హెండ్రిక్స్ స్వింగ్ ఎత్తులేమీ సన్నీ ముందు పని చేయలేదు. స్పిన్నర్ ఎడ్మండ్స్ బౌలింగ్‌లో సన్నీ ఆడిన డ్రైవ్‌లు, కట్ షాట్లూ అద్భుతమే.అతను సెంచరీ పూర్తి చేసినపుడు పదుల సంఖ్యలో వీక్షకులు పిచ్ దగ్గరికి పరుగెత్తుకొచ్చి అభినందించే క్రమంలో కింద పడేయబోయారు. సన్నీ డబుల్ సెంచరీ పూర్తయ్యాక ఓ అభిమాని లోనికొచ్చి హత్తుకుని ముద్దివ్వబోగా.. సన్నీ విడిపించుకుని బ్యాటుతో కొట్టబోయాడు. విజయానికి 49 పరుగులే అవసరమైన సమయంలో సన్నీ షార్ట్ మిడ్‌వికెట్‌లో దొరికిపోయాడు. ప్రత్యర్థి ఆటగాళ్లందరూ అతను పెవిలియన్‌కు చేరే వరకు చప్పట్లతో అభినందిస్తూనే ఉన్నారు. స్టేడియమంతా అతడికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. సహచరులు కాస్త కష్టపడి ఉంటే.. భారత్ చరిత్రాత్మక విజయం సాధించేది. సన్నీ ఇన్నింగ్స్ స్థాయే వేరుగా ఉండేది.
ఇదీ చూడండి : పాపులర్ సాంగ్‌కు భారత రెజ్లర్ భలే డ్యాన్స్