టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించుకునేందుకు బీసీసీఐకి సర్వహక్కులూ ఉన్నాయని వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ అన్నారు. ప్రయాణాలు, ప్రేక్షకులపై ఆంక్షలు విధించడమన్నది ఆస్ట్రేలియా ప్రభుత్వ ఇష్టమని పేర్కొన్నారు. బంతిపై మెరుపు రాబట్టేందుకు ఉమ్మిని ఉపయోగించడాన్ని నిషేధించడం వల్ల ఇబ్బందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
"ఐపీఎల్ నిర్వహణ కోసం టీ20 ప్రపంచకప్‌ను ఆలస్యం చేస్తారని నాకు అనిపించడం లేదు. నిర్దేశిత సమయం వరకు పర్యాటకులను అనుమతించాలా వద్దా అనేది ఆస్ట్రేలియా చట్టాలకు లోబడి ఉంటుంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ లేకపోతే అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించుకొనేందుకు బీసీసీఐకి సర్వహక్కులూ ఉన్నాయి. ఒకవేళ వారు ఉద్దేశపూర్వకంగా చేస్తే మీరు నిరాకరించొచ్చు" అని హోల్డింగ్ అన్నారు.
ఇటీవల కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో బంతిపై ఉమ్మినిరుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. దీన్ని అమలు చేసేందుకు ఇబ్బందులేమీ రావని హోల్డింగ్ అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్లు అలవాటు పడాల్సి ఉంటుందని వెల్లడించారు. ఉమ్మికి ప్రత్యామ్నాయంగా చెమట వినియోగించాలని సూచించారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో మెగాటోర్నీపై అనిశ్చితి నెలకొంది. టోర్నీ వాయిదాపై ఈ వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఇది చూడండి : పోర్న్‌స్టార్‌గా మారిన మహిళా కార్ రేసర్