'యునిసెఫ్'తో భాగస్వామ్యాన్ని మరింత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). మహిళలు, బాలికల సాధికారికత కోసం.. వచ్చే ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ వరకు యునిసెఫ్‌తో ఉంటామని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో బాలల హక్కుల కోసం యునిసెఫ్ పలు దేశాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. వీటి ద్వారా నిధులు సేకరిస్తోంది.
ప్రపంచకప్ సమయంలో...
ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ 'వన్ డే ఫర్ చిల్డ్రన్' పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసింది యునిసెఫ్. ఆ ఒక్కరోజు వచ్చిన టికెట్ డబ్బులను పిల్లలకు విరాళం రూపంలో ఇచ్చింది ఐసీసీ. వరల్డ్‌కప్ సమయంలో ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా దాదాపు 1 కోటి 28 లక్షల రూపాయలు సేకరించింది. ఈ నిధులను అఫ్గానిస్థాన్‌లోని బాలికల క్రికెట్ ప్రాజెక్టు కోసం వినియోగించనుంది. మెగాటోర్నీ జరిగే ప్రాంతంలోనూ క్రికెటర్లు.. పిల్లలతో క్రికెట్ ఆడటం, వారితో ముచ్చటించి ఆటపై అవగాహన ఏర్పరచడం వంటి ప్రోగ్రాములు నిర్వహించింది.
ఈ వేదిక ద్వారా మహిళల్లో క్రికెట్‌పై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా బాలికలకు క్రికెట్ నేర్పించడం, మౌలిక సదుపాయాలు, శిక్షణా సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కూడా పాలుపంచుకోవచ్చని ఐసీసీ తెలిపింది. టిక్కెట్ల కొనుగోలు ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చని పేర్కొంది. 2015 నుంచి ఐసీసీ, యునిసెఫ్ మధ్య ఈ మైత్రి కొనసాగుతోంది.