మే 28న జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. టోర్నీతో సహా అజెండాలోని అన్ని అంశాలపైనా నిర్ణయాన్ని జూన్ పదో తేదీకి వాయిదా వేసింది బోర్డు. రేపు జరిగే మీటింగ్లో టీ20 ప్రపంచకప్ భవితవ్యం తేలనుంది.
ఐదు అంశాలు..
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సమావేశంలో ఐసీసీ ఐదు అంశాలపై తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. అందులో టీ20 ప్రపంచకప్, ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నిక, క్రికెట్ బోర్డుల భవిష్యత్ ప్రణాళికలతో పాటు బీసీసీఐ, ఐసీసీ సీఈఓ నివేదించిన పన్ను సమస్యలపై పరిష్కారాన్ని చూపనుంది.
అయితే ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ తన పదవీకాలం పొడిగింపును కోరుకోవడం లేదని ఇప్పటికే తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆ పదవిని చేపట్టాలని సౌరవ్ గంగూలీకి పిలుపులు వెల్లువెత్తాయి. దీంతో అధ్యక్ష ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో ఈ మెగాటోర్నీని నిర్వహించే వీలులేదని పలువురు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం యథావిధిగా జరపాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి... సామిని 'కాలూ' అని పిలిచిందెవరంటే..?