సరైన సమయంలో తాను బౌలింగ్‌కు దిగుతానని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్య అన్నాడు. జట్టు అవసరాల మేరకు ఇతర ఆల్‌రౌండర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నాడు. ఆసీస్ చేతిలో ఓటమి పాలైన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ పోరులో అతడు 76 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత పాండ్య మళ్లీ బౌలింగ్ చేయలేదు. బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్ల అతడికి బంతి ఇవ్వడం లేదు.
"నా బౌలింగ్‌పై కసరత్తు చేస్తున్నాను. సరైన సమయంలోనే బంతి తీసుకుంటాను. నా బౌలింగ్ సామర్థ్యం 100% ఉండాలని భావిస్తున్నా. అంతర్జాతీయ స్థాయికి సరిపోయే వేగంతో బంతులు వేయాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం సుదీర్ఘ లక్ష్యంతో పనిచేస్తున్నాను. మేం టీ20 ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నాం. ఇతర టోర్నీలతో పోలిస్తే అక్కడ నా బౌలింగ్‌కు మరింత ప్రాముఖ్యం ఉంటుంది" అని పాండ్య అన్నాడు. జట్టులో మరో ఆల్‌రౌండర్ ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు 'బహుశా ఇందుకోసం పాండ్య (కృనాల్) కుటుంబాన్నే సంప్రదించాలేమో' అని చమత్కరించాడు.
భారీ లక్ష్యం ఛేదిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కసిగా ఆడాల్సి ఉంటుందని హార్దిక్ అన్నాడు. 'ఒక్కరే విజయం అందించలేరు. ఒక్కరితో అతిగా ప్రణాళికలు వేయలేం. ఇక ఐదుగురు బౌలర్లతో ఆడితే ఎప్పుడైనా కష్టమే. ఎవరైనా ఒకరు బాగా వేయకపోతే అతడి పనిని మరొకరు చేయలేరు. అందుకే ఆల్‌రౌండర్ ఉంటే కాస్త ఉపశమనం ఉంటుంది' అని వివరించాడు. తండ్రయ్యాక కాస్త ప్రశాంతంగా మారానని పాండ్య అన్నాడు.
'పిల్లలుంటే సాధారణంగా ఎక్కువ పని ఉంటుంది.జీవితాన్ని భిన్నంగా చూస్తాం. కుటుంబం పట్ల నా దృక్పథమూ మారిపోయింది. ఒక వ్యక్తిగానూ నేను మారాను. మరింత మెరుగయ్యేందుకే మార్పని భావిస్తున్నా. నా బిడ్డ (అగస్త్య)ను ఇప్పుడు చాలా మిస్సవుతున్నా. 15 రోజులప్పుడు నేను బయటకు వచ్చా. ఇప్పుడతనికి 4 నెలలు. నేను ఇంటికి వెళ్లేటప్పటికీ ఇంకా మారిపోతాడు. ఏదేమైనప్పటికీ నా జీవితంలో ఇదే అత్యుత్తమ సమయం" అని పాండ్య ముగించాడు.
ఇదీ చూడండి : అగస్త్యను చాలా మిస్ అవుతున్నా: హార్దిక్