ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు కోసం భారత జట్టు ఆటగాళ్లు సోమవారం.. సిడ్నీకి బయలుదేరనున్నారు. ఈ విమానంలోనే.. ఐసోలేషన్‌లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లూ సిడ్నీకి వెళ్లనున్నారు.
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్, రిషబ్ పంత్, పేసర్ నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షా.. బయో బుడగ నిబంధనలు ఉల్లంఘించారని తెలియడం వల్ల వీరు మూడో టెస్టు ఆడటం అనుమానంగా మారింది. కానీ ఎట్టకేలకు వీరు కూడా జట్టుతోనే సిడ్నీకి వెళుతుండటం వల్ల ఈ మ్యాచ్‌లో ఆడతారని స్పష్టత వచ్చినట్లైంది.
ఐదుగురు ఆటగాళ్ల విషయంలో దర్యాప్తు చేపడుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. బీసీసీఐ కూడా ఈ దర్యాప్తునకు సహకరిస్తోందని తెలిపింది. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా దీన్ని ఉల్లంఘనగా పరిగణించలేదని బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం భారత జట్టుతోనే ఈ ఐదుగురు ఆటగాళ్లూ ప్రయాణిస్తారని వెల్లడించారు.