ప్రపంచం మొత్తం జంకుతున్న కరోనా(కోవిడ్ 19) వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాను.. పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఎండగట్టాడు. ఆ దేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ చైనీయుల ఆహారపు అలవాట్లను ప్రశ్నించాడు. మీరు గబ్బిలాల్ని ఎందుకు తింటున్నారని అడిగాడు. వాటి రక్తాన్ని, మూత్రాన్ని తాగి ప్రపంచానికి ఈ వైరస్‌ను వ్యాప్తి చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
చైనీయులు ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేశారని చెప్పాడు అక్తర్. వారు కుక్కల్ని, పిల్లుల్ని ఎలా తింటారో అర్థం కావడంలేదన్నాడు. ఇలా చేయడం వల్ల తనకు చాలా కోపంగా ఉందన్నాడు. ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడిందని, పర్యాటకం రంగం దెబ్బతినిందని తెలిపాడు. ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతోందని, అన్నిదేశాలు పతనం అవుతున్నాయని అక్తర్ తన ఛానెల్‌లో వివరించాడు.
ఈ సందర్భంగా తాను చైనీయులకు వ్యతిరేకం కాదని, అక్కడ మూగజీవాలపై ఉన్న చట్టాలనే ప్రశ్నిస్తున్నానని స్పష్టంచేశాడు. మూగ జీవాలను తినడం వాళ్ల సంస్కృతి అయినట్లు తనకు తెలుసని, కానీ అలా తినడం వల్లే వారికి చేటు చేసిందన్నాడు. చైనాని నిషేధించాలని తాను చెప్పట్లేదని, ఏది పడితే అది తినడం సరికాదని వివరించాడు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా పాక్కు మద్దతుగా నిలిచే చైనాపైనే అక్తర్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా జరగడంపై అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు. దానికి కారణం.. పీఎస్‌ఎల్ ఆరంభమైన నాటి నుంచి ఆ దేశంలో పూర్తిస్థాయి టోర్నీ జరగడం ఇదే తొలిసారి. కరోనా ప్రభావంతో అది కూడా కళతప్పిందని వాపోయాడు. ప్రేక్షకులు లేకుండా ఆడాల్సి వస్తోందని, విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోతున్నారని చెప్పాడు. అయినా ఖాళీ స్టేడియాల్లోనే ఈ లీగ్ కొనసాగుతుందని మాజీ పేసర్ వెల్లడించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">