నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకించాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్. దీని వల్ల ఎక్కువ మ్యాచ్లు ఫలితం తేలకుండా డ్రా అయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.
"నేను ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా. నాలుగు రోజుల టెస్టుకు మద్దతిస్తున్నవారు సరైన కారణం ఒకటి చెప్పండి. ఈ మధ్య కాలంలో నాలుగురోజుల్లోనే ముగిసిన మ్యాచ్లు చాలానే ఉన్నాయి. అయితే వాటిల్లో ఎన్ని డ్రా అయ్యాయి? టెస్టులను పూర్తిగా నాలుగురోజులకే పరిమితం చేస్తే.. ఎక్కువ శాతం మ్యాచ్లు సమమవుతాయి. ఇదే ఎవ్వరూ పరిశీలించని అంశం. ఇందులోనూ కమర్షియల్గా చూస్తే కొంత లాభం ఉండొచ్చు. అవి ఎలా ఉంటుందంటే గురువారం వచ్చి ఆదివారం వెళ్లిపోయినట్లు ఉంటుంది"
-- రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా క్రికెటర్
అంతకుముందు ఇదే అంశంపై మాట్లాడిన సచిన్... కొత్త తరాన్ని ఆకర్షించడానికి ప్రతీది మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో వన్డేలు, టీ20లు, టీ10లు, 100 బాల్స్ ఫార్మాట్‌లు ఉన్నాయని చెప్పిన మాస్టర్... క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్ స్వచ్ఛమైన రూపమన్నాడు. సంప్రదాయమైన ఈ ఫార్మాట్ నిడివిని తగ్గించకూడదని చెప్పాడు.
2023-31 మధ్య కొత్త భవిష్యత్ పర్యటనల ప్రణాళికలో పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. దీనిపై ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బోర్డులు సుముఖంగా ఉన్నా... క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత సారథి విరాట్ కోహ్లీ,మాజీ క్రికెటర్ గంభీర్, ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్, స్పిన్నర్ లైయన్ వంటి ఎందరో ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.