ఇటీవల ఐపీఎల్లో ఆకట్టుకున్న యార్కర్ స్పెషలిస్టు నటరాజన్.. భారత్ తరఫున అరంగేట్ర వన్డేలోనే సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి మెప్పించాడు. ఈ సందర్భంగా పలువురు మాజీలు అతడిని ప్రశంసిస్తున్నారు. అయితే 2017 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కోసం అతడిని ఎంపిక చేస్తానంటే, తనను అందరూ ప్రశ్నించారంటూ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.
2017లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన నటరాజన్.. ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తద్వారా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు.
![kohli natarajan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9752105_nattu-1.jpg)
"2017 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కోసం నటరాజన్ ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు అతడి బౌలింగ్ వీడియోలు చూసిన తర్వాత, మా జట్టులో డెత్ బౌలర్ కావాలని నటరాజన్‌ను తీసుకున్నాం. తమిళనాడు ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడిన అతడిని ఎలా కొనుగోలు చేస్తారని అప్పుడు అందరూ నన్ను ప్రశ్నించారు. దురదృష్టవశాత్తూ ఆ ఏడాది నటరాజన్‌కు గాయమవడం వల్ల ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. విచిత్రమేమిటంటే అతడు ఆడిన మ్యాచ్‌లు మాత్రమే ఆ సీజన్లో పంజాబ్ గెలిచింది"
"నటరాజన్ భారత్ జట్టులో చోటు దక్కిందనే విషయం తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. అయితే టీ20లతో అరంగేట్రం చేస్తాడనుకున్న తాను.. వన్డేలు తొలుత ఆడటం కాస్త ఆశ్చర్యం కలిగించింది" అని సెహ్వాగ్ చెప్పాడు.
కాన్బెర్రాలో బుధవారం జరిగిన మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలవడం వల్ల 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. శుక్రవారం(డిసెంబరు 4) నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
![Everyone questioned when I picked T Natarajan for Kings XI Punjab: Virender Sehwag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9752105_nattu-3.jpg)
ఇవీ చదవండి: