ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ జెర్సీపై భారత సంతతికి చెందిన వైద్యుడు వికాస్ కుమార్ పేరు కనిపించింది. స్టోక్స్ జెర్సీపై వికాస్ పేరు ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? ప్రస్తుతం వికాస్ ఇంగ్లాండ్‌లోని డార్లింగ్‌టన్‌లో ఉన్న జాతీయ ఆరోగ్య సేవల (ఎన్‌హెచ్‌ఎస్) ట్రస్టు ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాడు.
కొవిడ్‌పై యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది గౌరవార్థం ఆ దేశ టెస్టు క్రికెటర్ల జెర్సీలపై.. వాళ్ల పేర్లు ఉండేలా చూడాలని అక్కడి క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఆ విధంగా వికాస్ పేరుతో ఉన్న జెర్సీని స్టోక్స్ ధరించాడు. స్టోక్స్ జెర్సీపై తన పేరు ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వికాస్ చెప్పాడు.
"స్టోక్స్‌తో పాటు ఇతర ఆటగాళ్లు మాకు మద్దతుగా నిలవడం ఆనందంగా ఉంది. మా అందరికీ ఇది కఠిన సమయం. ఎన్‌హెచ్‌ఎస్ సిబ్బంది ఎన్నో త్యాగాలు చేశారు. భారత్‌లో ఉన్న నా వైద్య మిత్రులతో పాటు ఆ రంగంలో ఉన్న వాళ్లందరికీ దక్కిన గొప్ప గుర్తింపు ఇది. క్రికెట్ అభిమానినైన నేను వైద్య కళాశాల జట్టు తరపున క్రికెట్ ఆడేవాణ్ని" అని వికాస్ తెలిపాడు.
మూడేళ్ల కిత్రం దిల్లీలో జరిగిన భారత్, శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌కు వైద్యుడిగా అతను విధులు నిర్వర్తించాడు.