ఏళ్లు గడిచే కొద్దీ క్రమేపీ క్రికెట్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెటర్లు శారీరక దారుఢ్యానికి ప్రాధాన్యమివ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ 'ఫిట్నెస్ కా బాప్'గా ఎంతో మంది అథ్లెట్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే ఈ ఫిట్‌నెస్‌కు సంబంధించి క్రికెటర్లకు చేసే యోయో టెస్టులో కోహ్లీనే మించిపోయాడు మరో భారత క్రికెటర్ అహ్మద్ బాండే. ఈ విషయమై తాజాగా 'ఈటీవీ భారత్'తో ముచ్చటించాడు.
మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి?
ఫిట్‌నెస్‌లో నేనే నెంబర్ వన్ అని ఇటీవలే ప్రచురితమైన ఓ ఆర్టికల్ ద్వారా తెలిసింది. క్రమం తప్పకుండా డైట్ పాటిస్తూ కసరత్తులు చేయడమే నా ఫిట్నెస్ రహస్యం.
యోయో టెస్ట్ అంటే ఏంటి?
20 మీటర్ల దూరంలో ఆటగాళ్లు పరుగెత్తాలి. అయితే పరుగెత్తే సమయంలో బీప్ శబ్దం వచ్చిన సమయంలో ఆటగాళ్లు వెనక్కి పరుగెత్తాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం తర్వాత బీప్ శబ్దాలు త్వరత్వరగా వస్తాయి. ఆ సమయానికి ఆటగాళ్లు నిర్ణీత సరిహద్దును చేరుకోవాలి. ఒక వేళ అలా చేరుకోకపోతే మరో రెండు బీప్ శబ్దాల లోపుగా వారు తమ లక్ష్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా సాఫ్ట్ వేర్ ఆధారంగా నిర్వహిస్తారు. ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు దాదాపు గంటకు ఎనిమిది కోలోమీటర్ల వేగం నుంచి 22, 23 కిలోమీటర్లు పరుగెత్తుతుంటారు. ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ 17.4 స్కోరును ప్రామాణికంగా నిర్ణయించింది. అయితే దాన్ని నేను అధిగమించి 19.2,19.4 స్కోర్‌ను సాధించా.
డైట్ ఎలా తీసుకుంటారు? మీ దృష్టిలో ఫిట్‌నెస్‌లో అతిముఖ్యమైన అంశం ఏంటి?
చాలా జాగ్రత్తగా డైట్ ఫాలో అవుతా. కొవ్వు పదార్థాలు, చిరుతిండి వంటివి ముట్టుకోను. దీంతో నా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఫలితంగా శరీరానికి ప్రాణవాయువు సరైన మోతాదులో అందుతుంది. శరీరం బాగా సహకరిస్తుంది.
లాక్డౌన్లో ఫిట్నెస్ కోసం ఏమి చేశారు?
లాక్డౌన్ వల్ల దాదాపు ఆరు, ఏడు నెలలపాటు జిమ్‌కు వెళ్లే అవకాశం దొరకలేదు. బయటకు వెళ్లి ఎటువంటి శిక్షణ చేయడం కుదరలేదు. జిమ్‌కు సంబంధించిన కొన్ని పరికరాలను కొని ముందే ఇంటికి తెచ్చుకున్నా. వాటితోనే నేను కసరత్తులు చేసేవాడిని. దీంతో పాటు డైట్ కూడా పాటించా.
టీమ్ఇండియా యోయో ప్రామాణిక స్కోర్ 17.4గా ఉండగా.. కోహ్లీ 19, మనీశ్ పాండే 19.2 స్కోర్‌తో ముందున్నారు.
ఇదీ చూడండి 'రోహిత్‌కు నిజంగానే గాయం అయిందా ?'