చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. శనివారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. చాహల్ వేసిన 16వ ఓవర్ మూడో బంతిని ధోనీ లాంగ్‌ఆన్ మీదుగా సిక్సర్ బాదాడు. దాంతో మహీ 300 సిక్సర్ల మైలురాయిని అధిగమించాడు. టీ20 క్రికెట్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ధోనీ కంటే ముందు మంబయి కెప్టెన్ రోహిత్‌శర్మ(375), చెన్నై ఆటగాడు (311) ఈ జాబితాలో ఉన్నారు. అయితే, మహీ టీ20 లీగ్‌లోనే 214 సిక్సర్లు బాదాడు. భారత జట్టు తరఫున కేవలం 52 మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ మొత్తంగా 323 టీ20లు ఆడిన ధోనీ 40.01సగటుతో 6,723 పరుగులు చేశాడు. 27 అర్ధశతకాలున్నాయి.
అయితే టీ20ల్లో అందరికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు మాత్రం విండీస్ వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. 978 మ్యాచ్‌లాడిన గేల్.. 404 సిక్సర్లు బాదాడు. టీ20 లీగ్‌లోనూ గేల్‌దే హవా.. అతను 125 మ్యాచుల్లోనే 326 సిక్సర్లు బాదాడు. గేల్ తర్వాత డివిలియర్స్, ధోనీ, రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, సురేశ్‌రైనా ఉన్నారు.
బెంగళూరుతో మ్యాచ్‌లో 170 పరుగుల లక్ష్యంతో చెన్నై ఛేదనకు దిగింది. అయితే ఆ జట్టు బ్యాట్స్‌మెన్ నుంచి ఏ మాత్రం ప్రతిఘటన కనిపించలేదు. మోరిస్ (3/19), వాష్టింగ్టన్ సుందర్ (2/16) విజృంభించడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నై ఖాతాలో ఐదో ఓటమి చేరింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.