దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులోని పది మంది డైరెక్టర్లూ రాజీనామా చేశారు. సంక్షోభంలో ఉన్న బోర్డులోని తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఆదివారం ఆరుగురు, సోమవారం నలుగురు.. తమ రాజీనామాల్ని సమర్పించారు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా ట్విట్టర్లో పంచుకుంది. దక్షిణాఫ్రిక్ స్పోర్ట్స్ కాన్ఫడరేషన్, ఒలింపిక్ కమిటీ సూచనల మేరకు త్వరలో తాత్కాలిక కమిటీ, బోర్డు బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
అసలేం జరిగింది?
2019 డిసెంబరు నుంచి దేశ క్రికెట్ బోర్డు తప్పులు చేస్తూనే ఉందని గతంలోనే దక్షిణాఫ్రికా ప్రభుత్వం పేర్కొంది. అవినీతి ఆరోపణలు, జాతి వివక్ష, వేతనాల్లో అవకతవకలు ఎక్కువయ్యాయని, దీంతో బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోనుందని క్రీడాశాఖ మంత్రి నాతి మెథ్వీ చెప్పారు. ఈ మేరకు అప్పట్లో ప్రకటన కూడా విడుదల చేశారు.
పాలనపరమైన నిర్ణయాల్లో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దుకోమని బోర్డుకు చాలాసార్లు చెప్పినా, వారిలో మార్పు రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాతి వెల్లడించారు.
అనంతరం డైరెక్టర్ల నుంచి వచ్చిన స్పందన దృష్ట్యా, బోర్డు విషయాల్లో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని అక్టోబరు 27 వరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బోర్డు డైరెక్టర్లు రాజీనామా చేశారు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల ప్రకారం, బోర్డు వ్యవహారాల్లో దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ అదే జరిగితే బోర్డును రద్దు చేస్తుంది. మరి ఇప్పుడు దక్షిణాఫ్రికా విషయంలో ఏం చేస్తుందో చూడాలి?