అన్యాయం, చట్ట విరుద్ధమైన చర్యల కారణంగానే క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ)లో సంక్షోభం తలెత్తిందని దాని మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 'సీఎస్‌ఏలో జాతి వివక్ష, అధికార దుర్వినియోగం, అవినీతి వంటి ఎన్నో అంశాలు క్రికెట్ ప్రతిష్ఠను దిగజార్చాయి' అంటూ సీఎస్‌ఏను.. దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ అండ్ ఒలింపిక్ కమిటీ (ఎస్‌ఏఎస్‌సీఓసీ) తన నియంత్రణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏస్‌ఏలో వివిధ విభాగాల్లో పని చేసిన మాజీ ఉద్యోగులు ఎక్‌స్టీన్, నాసీ, ఎంకుట, లుండి, నోలన్ ఆరు పేజీల లేఖను ఎస్‌ఏఎస్‌సీఓసీకి పంపించారు.
"కొంతమంది ప్రతినిధులు సీఎస్‌ఏతో సహా పార్లమెంట్, క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించారు. వాటాదారుల బాధ్యతారాహిత్యం, ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే సీఎస్‌ఏ ఇబ్బందుల్లో పడిందని కథ అల్లి.. మాతో పాటు చాలా మందిని ఉద్యోగాల నుంచి తప్పించారు. మమ్మల్ని తొలగించడం ద్వారా సమస్య పరిష్కారమైందని చూపించి, పాలనాపరమైన విషయాల్లో న్యాయంగానే ఉంటున్నామని నమ్మించే ప్రయత్నం చేశారు. మా విషయంలో ఎలాంటి విలువల పాటించకుండా, న్యాయబద్ధంగా వ్యవహరించకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తించారు"
-- సీఎస్‌ఏ మాజీ ఉద్యోగులు
ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ..
జట్టు ఎంపికలో సరైన విధంగా వ్యవహరించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది ఆ దేశ ప్రభుత్వం. బోర్డులోని ఉన్నతాధికారులు తక్షణమే వారి పదవుల నుంచి వైదొలగాలని ఆదేశించింది. సెప్టెంబర్ 11 నుంచి క్రికెట్ తమ పర్యవేక్షణలో సాగుతుందని పేర్కొంది. క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. ఈ పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది.