ఈ వేసవిలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే షెఫీల్డ్ షీల్డ్‌లో డ్యూక్స్ బంతికి బదులుగా కూకబుర్రాను ఉపయోగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది. ఇప్పటికే నాలుగు సీజన్లులో కూకబుర్రా బంతులను వినియోగించగా.. 2020-21లో జరిగే ఫస్ట్‌క్లాస్ మొత్తం సీజన్‌కు ఆ బంతిని ఉపయోగిస్తామని సీఏ ప్రకటించింది. ఈ విషయంపై సీఏ ఆపరేషన్స్ హెడ్ పీటర్ రోచ్ మాట్లాడారు.
"డ్యూక్ బంతిని ప్రవేశపెట్టడం విలువైనదే. ముఖ్యంగా యాషెస్ సిరీస్ వరకు డ్యూక్స్ బంతిని ఇంగ్లాండ్ వాళ్లు బాగా ఉపయోగిస్తున్నారు. గత నాలుగు సీజన్లలో ఈ బంతితో ఆస్ట్రేలియా ప్రదర్శనపై మేం సంతృప్తిగా ఉన్నాం. అయితే 2020-21 సీజన్లో కూకబుర్రా బంతి, ఆటగాళ్లకు నిలకడగా ఆడేందుకు ఉపయోగిపడుతుందని భావిస్తున్నాం. గత సీజన్లో షెఫీల్డ్ టోర్నీలో స్పిన్నర్లు డ్యూక్స్ బంతితో రాణించలేకపోయారని గుర్తించాం. దీంతో ఆ బంతిని మార్చాలని అనుకున్నాం. ఇది సానుకూల ప్రయోజనం కలిగిస్తుందని ఆశిస్తున్నాం"
- పీటర్ రోచ్, క్రికెట్ ఆస్ట్రేలియా ఆపరేషన్స్ హెడ్
డ్యూక్స్ బంతిని తిరిగి సరైన సమయంలో వాడుకలోకి తెస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇంగ్లాండ్ పరిస్థితులను అలవాటు చేసుకోవాలనే లక్ష్యంతో 2016-17 సీజన్ నుంచి డ్యూక్స్ బంతులను ఉపయోగిస్తుంది ఆసీస్.