కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్-13వ సీజన్ ఎట్టకేలకు సెప్టెంబరు 19న ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ ఐపీఎల్ విజేత గురించి అప్పుడే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ జోస్యం చెప్పాడు. ఐపీఎల్ కవరేజీలో భాగంగా అతడు ముంబయి వచ్చాడు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో భాగంగా ఈసారి ఐపీఎల్ విజేతగా ఎవరు నిలుస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా.. దీనికి సమాధానం చెప్పడం కొంత కష్టమేనన్నాడు. అయినప్పటికీ సీఎస్‌కే విజేతగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు.
గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా జట్లకు లీ ప్రాతినిధ్యం వహించాడు. కేకేఆర్ జట్టుకూ ఈ సారి మంచి అవకాశమే ఉందని లీ అన్నాడు. టాప్ -4 జట్లలో కేకేఆర్ కచ్చితంగా ఉంటుందన్నాడు.
కోల్‌కతా జట్టుకు దినేష్ కార్తీక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆ జట్టు సెప్టెంబరు 23న ఐపీఎల్లో వేట ప్రారంభించనుంది. ఆ మ్యాచ్‌లో నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. సీఎస్‌కే సెప్టెంబరు 19న ముంబయితో ఆడనుంది. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన సీఎస్‌కే కరోనా సంక్షోభంలో చిక్కుకుంది. వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లు ఆ జట్టుకు దూరమయ్యారు. మరిన్ని సమస్యలలో చిక్కుకున్న సీఎస్‌కే బ్రెట్‌లీ చెప్పినట్లు విజేతగా నిలుస్తుందా లేక చతికిల పడుతుందా తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...!
ఇదీ చూడండి ఐపీఎల్2020: సన్‌రైజర్స్ బలాలు, బలహీనతలు ఇవే!