ఇప్పటివరకు తాను ఆడిన ఫ్రాంచైజీల్లో చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే) ఉత్తమ జట్టని శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. ఇటీవలే మైండ్ మాస్టర్స్ షోలో పాల్గొన్న ఆయన.. సీఎస్కేలో చేరినప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. చెన్నైకి చెందిన స్థానిక ఆటగాళ్లతో ఉన్నప్పుడు తామంతా సొంత భాషలో మాట్లాడుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. ధోనీ పట్ల ఉన్న గౌరవం వల్లే.. సీఎస్కే జట్టులో భాగం కావాలని కోరుకున్నట్లు మురళీధరన్ వెల్లడించారు.
"నేను ఐపీఎల్లో పాల్గొంటే చెన్నైకి ఆడాలని దేవుడ్ని ప్రార్థించా. ప్రతి జట్టులో స్థానిక ఆటగాళ్లు ఉండాలని నియమం ఉండేది. సుమారు 7, 8 మంది మాతృభాష మాట్లాడేవాళ్లమే ఉన్నాం. ఫలితంగా 3ఏళ్లు సొంత భాషలో మాట్లాడుకునే వీలు కలిగింది. నేను 6 నుంచి 7 సంవత్సరాలు లంకషైర్ తరఫున కూడా ఆడా. కానీ ఇప్పటివరకు నేను ఆడిన ఫ్రాంచైజీల్లో ఉత్తమమైనది 'సీఎస్కే'."
-ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక మాజీ బౌలర్
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా గుర్తింపు పొందుతూ వచ్చింది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని జట్టు ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సీఎస్కేలో.. ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు సంవత్సరాలుగా భాగమవుతూ వచ్చారు. వారిలో శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ఒకరు. ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో సీఎస్కేలో చేరారు. 2008 నుంచి 2010 వరకు జట్టు తరఫున మూడు సీజన్లు ఆడారు.
ఇదీ చూడండి: