ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల బలహీనతను భారత్ సరిగానే అంచనా వేసిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ తెలిపాడు. స్పిన్ భయాలను టీమ్ఇండియా తమకు అనుకూలంగా మలుచుకుందని పేర్కొన్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన పింక్ టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్ 11, రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లతో సత్తా చాటారు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
" పింక్ టెస్టు అనంతరం మ్యాచ్ గురించి మాట్లాడిన కోహ్లీ.. 'వింతగా' అనిపించిందని తెలిపాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమైన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు ఈ పదం సరిగ్గా సరిపోతుంది. స్పిన్‌ను ఆడటంలో జో రూట్ మినహా ఇంగ్లాండ్ జట్టంతా విఫలమైన విషయాన్ని రెండో టెస్టులోనే టీమ్ఇండియా గమనించింది. అందుకే మూడో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల అసమర్థతను సరిగ్గా గ్రహించిన భారత్.. అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది."
-ఇయాన్ ఛాపెల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.
"ఇంగ్లాండ్ ఆటగాళ్లు టీమ్ఇండియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయారు. వికెట్లకు నేరుగా వేసిన బంతులకే వికెట్లు పడ్డాయి. అందుకు జానీ బెయిర్ స్టో ఔటైన విధానమే ఒక ఉదహరణ. ఈ వికెట్‌పై బంతి అతిగా తిరగలేదు. స్పిన్‌కు వారు ఎక్కువగా కంగారుపడ్డారు. వారి డిఫెన్స్నూ వారు నమ్మలేదు. రివర్స్ స్వీప్ మాత్రమే ఆడటానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు" అని ఛాపెల్ పేర్కొన్నాడు.
స్పిన్‌ను ఎదుర్కోవాలంటే ఆటగాళ్లకు ఫుట్‌వర్క్ బాగా ఉండాలని ఛాపెల్ తెలిపాడు. ఈ నైపుణ్యం ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఒక్క ఒల్లీ పోప్ మాత్రమే గ్రహించాడు. కానీ, దాని అమలులో విఫలమయ్యాడని పేర్కొన్నాడు. 'మూడు అంగుళాల దూరంలో ఉండి స్టంపౌట్ కావొచ్చేమో కానీ మూడు ఇంచుల దూరం తేడాతో ఔట్ అవ్వొద్దు'.. 'క్రీజు వదిలి ముందుకు పోయినప్పుడు కీపర్ గురించి ఆలోచించవద్దని' ఛాపెల్ సూచించాడు.
ఇదీ చదవండి: డబ్ల్యూటీసీలో భారత్ ఫైనల్ చేరితే ఆసియా కప్ వాయిదా!