భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రూపంలో ఇంగ్లాండ్‌కు అతిపెద్ద సవాలు ఎదురుకానుందని అన్నాడు ఆ జట్టు ఓపెనర్ రోరీ బర్న్స్. అతడిని ఎదుర్కొవడానికి ప్రణాళికలు రచించడం కూడా కష్టమని చెప్పాడు.
"బుమ్రా చాలా కఠిన వ్యక్తి. అతడిని ఎదుర్కోవడం సవాలే. అతడి బౌలింగ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. అతడు బంతిని విసిరే కోణాన్ని అనుసరించి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటనలో చూశాను.. భారత్ మంచి ఫామ్‌లో ఉంది. తుది జట్టే కాదు వారి రిజర్వ్ బెంచ్ కూడా పటిష్ఠంగా ఉంది. స్వదేశంలో వారికి అనుకూల పరిస్థితుల్లో ఆడటం సవాలుతో కూడినది."
- రోరీ బర్న్స్, ఇంగ్లాండ్ ఓపెనర్
ఇంగ్లాండ్ స్పిన్ ద్వయం డామ్ బెస్, జాక్ లీచ్ వారిపై వారు అంచనాలు పెట్టుకోకుండా సహజ ఆట ఆడాలని బర్న్స్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో పర్యటనలో వార్మప్‌కు ఎక్కువ సమయం లేకపోవడం కూడా సవాలేనని అన్నాడు. ఇక్కడి పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతామన్నదే ముఖ్యమని చెప్పాడు. ఇక బ్యాటింగ్‌లో తమ కెప్టెన్ రూట్ జట్టుకు ప్రధాన బలమని అన్నాడు బర్న్స్.
ఇదీ చూడండి: 'భారత్‌ను దెబ్బతీయడం ఇంగ్లాండ్‌కు కష్టమే.. కానీ'