టీమిండియా వికెట్ కీపర్, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కు రెండు నెలలు విశ్రాంతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్నాడు. దక్షిణ కశ్మీర్‌లోని పారా రెజిమెంట్ యూనిట్‌లో బాధ్యతల్ని నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 15 వరకు అక్కడే సైనిక విధుల్లో పాల్గొంటాడు.
కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ధోనీ భద్రతపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడు మాత్రం సాధారణ సైనికుడిలా అక్కడ పనిచేస్తున్నాడు. ఈ విషయంపై భారత ఆర్మీ ఛీప్ బిపిన్ రావత్ స్పందించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
భారత పౌరుడు ఆర్మీ దుస్తులు ధరించడానికి సిద్ధపడితే.. వాటికి తగిన బాధ్యతలు నిర్వర్తించాలని బిపిన్ రావత్ తెలిపారు. ధోనీ ఇప్పటికే తన కార్యకలాపాలను ప్రారంభించాడని, తనకిచ్చిన బాధ్యతలను దిగ్విజయంగా పూర్తి చేస్తాడనే నమ్మకముందని రావత్ చెప్పుకొచ్చారు.
ప్రపంచకప్‌లో తన ఆటపై వచ్చిన విమర్శల నేపథ్యంలో క్రికెట్ నుంచి ధోనీ రిటైరవుతాడని అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే రెండు నెలలు పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న మహీ.. ప్రస్తుత విండీస్ టూర్‌కు దూరమయ్యాడు.
ఇవీ చూడండి.. భారత్ బౌలర్ నవదీప్ సైనీకి ఐసీసీ హెచ్చరిక