భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ... బుధవారం బాధ్యతలు చేపట్టాడు. 33 నెలల పాటు బీసీసీఐని నడపించిన సుప్రీంకోర్టు నియమిత పారిపాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల 39వ అధ్యక్షుడిగా నియమితమయ్యాడు దాదా. గంగూలీతో పాటు పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ సింగ్ ధూమల్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ముందున్న కీలక సవాళ్లివే..
- ఐసీసీలో భారత్ ఆధిపత్యం...
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఎన్నికైన తర్వాత బీసీసీఐ ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. ఇటీవల జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో భారత బోర్డు లేకుండానే కార్యక్రమం జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడైన శ్రీనివాసన్ గతంలో ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్ ముఖ్యమైన దేశాలుగా ఉండేవి. ఇవే పెత్తందారులుగా వ్యవహరించేవి. ఇప్పుడు బీసీసీఐ తన ఆధిపత్యం తిరిగి తెచ్చుకునే దిశగా గంగూలీ ప్రయత్నించాలి.
- ఆదాయంలో భారీ కోత....
మూడేళ్ళ క్రితం వరకు ప్రపంచ క్రికెట్‌లోని అన్ని బోర్డుల కంటే ఐసీసీ నుంచి బీసీసీఐ భారీ రెవెన్యూ తీసుకునేది. నూతన మార్గదర్శకాల ఆధారంగా బీసీసీఐ ఆదాయంలో భారీగా కోత విధించింది ఐసీసీ. 2016 నుంచి 2023 వరకు బీసీసీఐ వాటా ప్రకారం 405 మిలియన్ డాలర్లు పొందాల్సి ఉన్నా... 293 మిలియన్ డాలర్లు మాత్రమే అందుకోనుంది. ఇప్పుడు ఇదే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ దృష్టి పెట్టబోతున్నాడు.
- పన్ను మినహాయింపు తేలాల్సిందే..
ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి ఏదైనా టోర్నీలు జరిగినప్పుడు టీవీ ప్రొడక్షన్ పరికరాలను దిగుమతి చేసుకునే విషయంలో ఎక్సైజ్ పన్ను మినహాయింపును కోరుతుంది. అయితే 2016లో భారత్ ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్ సమయంలో బీసీసీఐ ఆ పద్ధతికి ఒప్పుకోలేదు. పన్ను మినహాయింపు విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి వివరణ ఇచ్చింది. అంతేకాకుండా 10 శాతం పన్ను కట్టాల్సిందేనంటూ ఆ మ్యాచ్‌లను ప్రసారం చేసిన ప్రసారదారు స్టార్‌స్పోర్ట్‌కు ఐటీశాఖ నోటీసులూ పంపింది.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఐసీసీ... బీసీసీఐ వార్షిక ఆదాయం నుంచి పన్ను రూపంలో తమకు రావాల్సిన సొమ్మును తీసుకోవాలని భావిస్తోంది. ఇదే చేస్తే బోర్డు వార్షిక ఆదాయం 405 మిలియన్ డాలర్ల నుంచి 40.5 మిలియన్ డాలర్ల (రూ.286 కోట్లు)ను కోల్పోవాల్సి వస్తోంది. ఈ విషయంలో భారత క్రికెట్ బోర్డు సలహా కోసం ఓ బ్రిటీష్ న్యాయ సంస్థను ఆశ్రయించేందుకు సిద్ధమైంది. దీనిపై భారత ప్రభుత్వం, ఐసీసీతో గంగూలీ చర్చించాల్సి ఉంది.
- ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు జీతాలు...
ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే తొలి ప్రాధాన్యంగా భావిస్తున్నాడు గంగూలీ. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల రెమ్యునరేషన్లు కచ్చితంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఒక్కో ఆటగాడు మ్యాచ్‌కు రూ. 1.4 లక్షలు తీసుకుంటున్నాడు. దీన్ని 2.5 లక్షలకు పెంచాలని భావిస్తున్నాడు దాదా. అయితే ఈ డబ్బును టీవీ హక్కుల ద్వారా లేదంటే బీసీసీఐ నిధుల నుంచి ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రపంచంలోనే ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ.. వార్షికాదాయంలో ప్రస్తుతం 26శాతం జీతాల రూపంలో ఖర్చు చేస్తోంది. అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడే వాళ్లకు 13 శాతం, దేశవాళీ ఆటగాళ్లకు 10.6శాతం, మహిళలు, జూనియర్ క్రికెటర్లకు 2.4శాతం జీతాల రూపంలో వెచ్చిస్తోంది.
- దేశవాళీల్లోనూ మౌలిక సదుపాయాలు...
దేవదర్, రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల నిర్వహణ, అంపైర్ల కొరతపైనా దాదా దృష్టిపెట్టాల్సి ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే మైదానాల్లో నాణ్యమైన పిచ్‌ల ఏర్పాటు, అంపైర్లకు పరీక్షలు వంటి విషయాలపై ఆలోచించాలి.
- డే/నైట్ టెస్టు క్రికెట్...
2016లో డే/నైట్ టెస్టు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని భావించింది బీసీసీఐ. ఇందులో భాగంగా దులిప్ ట్రోఫీలో ఇప్పటికే పింక్ బాల్‌తో ప్రయోగం చేసి విఫలమైంది. సాధారణంగా టెస్టుల్లో ఎరుపు, వన్డేల్లో తెలుపు బంతి వాడతారు. పింక్ బాల్ తయారీలో నాణ్యతాపరమైన లోపాలు సహా బంతి రాత్రి వేళల్లో కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. దీనిపై గంగూలీ ఏం నిర్ణయం తీసుకంటాడో చూడాలి.
- పరస్పర విరుద్ధ ప్రయోజనం...
టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ గతంలో పరస్పర విరుద్ధ ప్రయోజనం అంశం కింద నోటీసులు అందుకున్నారు. ఈ నిబంధన వల్ల అత్యుత్తమ క్రికెటర్ల సహాయ సహాకారాలు జాతీయ, రాష్ట్రస్థాయి ఆటగాళ్లు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురౌతున్నాయని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. లోథా కమిటీ పెట్టిన ఈ నిబంధనపైనా కొన్ని మార్పులు కోరేందుకు సిద్ధమవుతున్నాడు.