సౌరభ్ గంగూలీ బీసీసీఐ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారి వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నేడు జరిగింది. ఇది మొత్తంగా 88వ బీసీసీఐ సమావేశం. ముంబయిలోని భారత క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో గంగూలీ బృందం ఈ మేరకు భేటీ అయింది. ఈ సమావేశంలో బీసీసీఐ పాలనలో అడుగడుగునా అడ్డంకిగా మారుతున్న లోధా కమిటీ సంస్కరణల్లో మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మార్పులను సుప్రీం ముందు ఉంచారు. అత్యున్నత న్యాయస్థానం వీటికి ఆమోదం తెలపాల్సి ఉంది.
2024 వరకు దాదానే..!
బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీస్ బేరర్.. మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలని లోధా కమిటీ పెట్టిన షరతును మార్పు చేసేందుకు సభ్యులు ఆమోదించారు. దీని వల్ల గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా 2024 వరకు కొనసాగే వీలుంది. గత నిబంధన ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 23న పదవి చేపట్టిన దాదా... పది నెలల్లోనే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా అయిదేళ్లకు పైగా పని చేసిన గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడవడమే ఇందుకు కారణం.
తప్పనిసరి విరామ నిబంధన వల్ల దాదానే కాక అనేకమంది సీనియర్ ఆఫీస్ బేరర్లు ఇబ్బంది పడుతుండటం.. వీరి అనుభవం వృథా అయి, పాలన సమస్యాత్మకంగా మారుతుండటం వల్ల దీన్ని మార్చాలని బోర్డు కార్యవర్గం నిర్ణయించింది.