క్రికెట్లో అంపైరింగ్ ప్రమాణాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ విషయంపై అభిమానులు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. గురువారం.. ముంబయి-బరోడా మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. నాటౌట్ను ఔట్‌గా ప్రకటించాడు అంపైర్. మైదానం నుంచి వెళ్లనంటూ ఆ బ్యాట్స్‌మన్ అక్కడే నిల్చుండిపోయాడు. చివరకు చేసేదేమి లేక భారంగా వెనుదిరిగాడు.
అసలేం జరిగింది?
ముంబయి-బరోడా మధ్య రంజీ మ్యాచ్. 533 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా 169 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. క్రీజులో యూసఫ్ పఠాన్ ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో ముంబయి స్పిన్నర్ శశాంక్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అనుహ్యంగా బౌన్స్ అయి పఠాన్ ఛాతికి తగిలి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జయ్ బిస్తా చేతుల్లో పడింది. ముంబయి ఫీల్డర్లు అప్పీలు చేశారు.
కాసేపు సంకోచించిన అంపైర్.. పఠాన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ముంబై క్రికెటర్లు సంబరాలు చేసుకోగా, పఠాన్ షాక్‌కు గురయ్యాడు. క్రీజు వదిలి వెళ్లడానికి నిరాకరించాడు. చివరకు చేసేదేమి లేక నిరాశగా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో ముంబయి 309 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముంబయి క్రికెటర్ పృథ్వీషా డబుల్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇది చదవండి: పృథ్వీషా 'డబుల్' ధమాకా.. ఆధిక్యంలో ముంబయి