భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ రేసులో ముందంజ వేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే సిడ్నీ మైదానంలో భారత్‌కు గొప్ప రికార్డేమి లేదు. ఆడిన 12 టెస్టుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. 1978లో బిషన్‌సింగ్ బేడి నాయకత్వంలో టీమ్ఇండియా ఇన్నింగ్స్ రెండు పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. ఆ తర్వాత తొమ్మిది టెస్టుల్లో భారత్ తలపడినా మరో గెలుపు అందుకోలేకపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై మిగిలిన టెస్టులను డ్రాగా ముగించింది.
అయితే తొలి టెస్టు ఘోరపరాజయం అనంతరం ప్రతికూలతల నడుమ రెండో టెస్టులో భారత జట్టును రహానె గొప్పగా నడిపించాడు. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. విజయోత్సాహంతో మూడో టెస్టులోనూ కంగారూలపై పైచేయి సాధించి.. 42 ఏళ్ల ‘సిడ్నీ గెలుపు’ నిరీక్షణకు రహానె తెరదించుతాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి, తన కెప్టెన్సీలో ఓటమెరుగని రహానె ఈ అరుదైన ఘనత సాధిస్తాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిఉండాల్సిందే.
మరో రెండు రికార్డులు
సిడ్నీ టెస్టులో రహానె జట్టును గెలిపిస్తే మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. తొలి నాలుగు టెస్టులు విజయం సాధించిన భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ సరసన నిలుస్తాడు. ఇప్పటివరకు మూడు టెస్టులకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన రహానె అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. అయితే బ్యాట్స్‌మన్‌గానూ రహానె మరోరికార్డుపై కన్నేశాడు. మరో 203 పరుగులు చేస్తే కంగారూల గడ్డపై 1000 పరుగులు పూర్తిచేసిన అయిదో భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో సచిన్ (1809), కోహ్లీ (1352) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.