ఆస్ట్రేలియా ఇకపై మేటి జట్టు కాదని, అదెప్పుడో గతంలోని మాట అని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ విమర్శించాడు. ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లు బలమైన ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన స్వాన్.. ఇంగ్లాండ్ జట్టు ఇక మీదట యాషెస్ సిరీస్ గురించి కాకుండా టీమ్‌ఇండియాపై దృష్టి సారించాలని అన్నాడు.
'ఇంగ్లాండ్ టీమ్ ఇంతకుముందెప్పుడూ యాషెస్ సిరీస్ గురించే మాట్లాడేది. అయితే ఆస్ట్రేలియా ప్రస్తుతం అత్యుత్తమ జట్టు కాదు. అది గతంలో అలా ఉండేది. కానీ, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆ జట్టుతో యాషెస్ సిరీస్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇకపై అది మర్చిపోయి ముందుకు సాగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియాను వారి సొంత గడ్డపై ఓడించడం అన్నింటికన్నా పెద్ద విశేషం. 2012లో భారత పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్ టీమ్‌ఇండియాను ఓడించింది. ఆ తర్వాత భారత్ బలంగా మారింది' అని స్వాన్ పేర్కొన్నాడు.
'ఇంగ్లాండ్ ఇప్పుడు నంబర్ వన్ జట్టుగా ఎదగాలంటే ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించాలనే విషయాన్ని వదిలేసి టీమ్‌ఇండియాపై దృష్టి పెట్టాలి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకొని, టీమ్‌ఇండియాపై స్పిన్ బౌలింగ్‌తో విరుచుకుపడాలి. గత పర్యటనలో కెవిన్ పీటర్సన్ ఎలా ఆడాడో అలాంటి ప్రదర్శన చేయాలి. ఇంగ్లాండ్ స్పిన్నర్లు వికెట్లు తీయలేనంత కాలం భారత్‌ను సొంత గడ్డపై ఓడించడం కష్టం. ఆ పర్యటనలో పీటర్సన్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. అతడెంతో దూకుడుగా ఆడాడు. అతడి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. అతడి ఆటను ఒక ఉదాహరణలా తీసుకొని ఉత్తమ ప్రదర్శన చేయాలి' అని మాజీ స్పిన్నర్ తమ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు.
ఇదీ చదవండి: బైక్‌కు దారి ఇవ్వలేదని బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడి