ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో 600 వికెట్లు సాధించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పాకిస్థాన్ ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ అన్నాడు. సౌతాంప్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో అండర్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు కైవసం చేసుకున్న తొలి పేసర్ అండర్సన్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మిస్బా తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
"అండర్సన్ 600 టెస్టు వికెట్లు సాధించడం నిజంగా అద్భుతం. అతను అసాధారణమైన క్రమశిక్షణ, ప్రేరణ, దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఓ పేసర్ ఇన్ని వికెట్లు పడగొట్టడం చాలా కష్టం. అతని వ్యూహాలతో.. బ్యాట్స్‌మెన్‌కు ఎప్పుడూ సవాలు విసురుతుంటాడు. మేము కూడా యువ బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అనిపిస్తోంది."
-మిస్బావుల్ హక్, పాక్ ప్రధాన కోచ్
పాక్ బౌలర్లు కూడా అండర్సన్ నుంచి మెలకువలు నేర్చుకుని.. టెస్టు ఫార్మాట్లో పురోగతి సాధించాలని మిస్పా పేర్కొన్నాడు. "మా బౌలర్లు ఈ సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నారు. టెస్టు ముగిసిన తర్వాత జిమ్మీతో బౌలింగ్ గురించి మాట్లాడే అవకాశం షాహిన్‌కు లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది వారికి ఎంతో సాయపడుతుంది" అని మిస్బా తెలిపాడు.
ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన వారిలో అండర్సన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్(800), షేన్ వార్న్(708), అనిల్ కుంబ్లే(619) వికెట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.