భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రేసులో టీమ్‌ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ నిలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యుల పదవీకాలం పూర్తవడం వల్ల వాళ్ల స్థానాల్లో కొత్త వాళ్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.
అయితే ఈ ఏడాది జనవరిలోనూ సెలక్టర్ పదవి కోసం అగార్కర్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. జోనల్ విధానం కారణంగా అతనికి ఆ పదవి దక్కలేదు. తాజాగా మరోసారి వెస్ట్ జోన్ తరపున అతను దరఖాస్తు చేసుకునే అవకాశాలున్న నేపథ్యంలో.. 231 అంతర్జాతీయ మ్యాచ్‌ల (191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20) అనుభవం ఉన్న అతనే ఛైర్మన్‌గా ఎంపికయ్యే వీలుంది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎక్కువ టెస్టులు ఆడిన ఆటగాణ్ని ఛైర్మన్‌గా నియమించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న సునీల్ జోషీకి 15 టెస్టుల అనుభవమే ఉంది కాబట్టి.. నూతన కమిటీ ఎంపిక తర్వాత అతను ఛైర్మన్‌గా కొనసాగే అవకాశం లేదు. ప్రపంచకప్ (1987)లో భారత్ తరపున తొలి హ్యాట్రిక్ తీసిన మాజీ పేసర్ చేతన్ శర్మ, మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్.. నార్త్ జోన్ నుంచి దరఖాస్తులు సమర్పించారు.