విద్యార్థుల కోసం 'క్రికెట్-మ్యాథ్' అనే ప్రత్యేక ఆన్లైన్ మ్యాథ్ స్కిల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది టీమ్ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ సంస్థ ఏసీఈ. 'అన్మ్యాథ్' పాఠశాల అనుసంధానంతో దీనిని ప్రవేశపెట్టారు. క్రికెట్‌కు సంబంధించిన వివిధ అంశాల సాయంతో పిల్లలకు సరళంగా గణితం అర్థమయ్యేలా దీనిని రూపొందించారు. తద్వారా వారికి లెక్కలపై పూర్తి అవగాహన సహా జ్ఞానం పెంపొందించడమే ఈ స్కిల్ కార్యక్రమం లక్ష్యం.
అగార్కర్, అతడి భార్య ఫాతిమా, అన్మ్యాథ్ పాఠశాల వ్యవస్థాపకుడు దివేష్ బథిజా, ఓ సీరియల్ ఎంట్రప్రెన్యూర్ కలిసి దీన్ని నిర్వహిస్తున్నారు.
ఇంటి వద్ద నుంచే విద్యార్థులు టెక్ట్స్ బుక్‌లోని సారాంశాన్ని క్లుప్తంగా, సరళంగా అర్థం చేసుకునేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో వర్చువల్ సంభాషణలు, క్రికెట్ వీడియోలు, కేస్ స్టడీస్, క్రికెట్ అభిమానులతో చర్చలు వంటి సర్టిఫైడ్ కోర్సులు పొందుపరిచారు.
అయితే ఇది కేవలం ఐదు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులు కోసం మాత్రమే రూపొందించారు. రూకి ప్లే, రూకి ప్లస్ ప్లే, ప్రో ప్లే వంటి స్థాయిలు ఇందులో ఉంటాయి.
జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను పిల్లలు ఎదుర్కొనేందుకు, కొత్త అంశాలను నిత్యం నేర్చుకునేలా వారి మనో వికాసాన్ని పెంపొందించేందుకు ఈ స్కిల్ కార్యక్రమం దోహదపడుతుందని అగార్కర్ వెల్లడించాడు.
ఇది చూడండి : 'ఆ నిషేధం.. నా ఆలోచన విధానాన్నే మార్చేసింది'