దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఇంగ్లీష్ కౌంటీలో ఆరంగేట్రంలోనే సత్తా చాటాడు. లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన దేశీయ టీ20లో మిడిల్‌ఎసెక్స్ తరఫున బరిలోకి దిగి... 43 బంతుల్లోనే 88 పరుగులు సాధించాడు. ఫలితంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఎసెక్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది మిడిలెసెక్స్.
తొలుత బ్యాటింగ్ చేసిన సిమన్ హర్మర్ సారథ్యంలోని ఎసెక్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది మిడిలెసెక్స్. సారథి డేవిడ్ మలన్ 43 పరుగులు చేయగా... చివరి వరకు నాటౌట్‌గా నిలిచిన డివిలియర్స్ 88 (43 బంతుల్లో; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. అంతేకాదు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కూడా 'మిస్టర్ 360' సొంతమైంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా డాషింగ్ బ్యాట్స్‌మెన్ ఏబీడీ ఇటీవలి ప్రపంచకప్‌లోనూ ఆడలేదు. మిడిలెసెక్స్ కౌంటీ క్లబ్ తరఫున డివిలియర్స్ 7 టీ20లు ఆడతాడని... అవసరమైతే మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని ఆ జట్టు కోచ్ స్టువర్ట్ లా తెలిపాడు. డివిలియర్స్ ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలో పాల్గొన్నాడు. 2008 నుంచి ఇప్పటివరకూ 40 సగటుతో నాలుగు వేల పరుగులు చేయడం విశేషం.
ఇవీ చూడండి... డివిలియర్స్ వస్తానన్నా.. వద్దన్నారు