ఈ దశాబ్దపు టీ20 జట్టులో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. బట్లర్ లాంటి బ్యాట్స్‌మన్‌ను తీసుకోకపోవడం విస్మయానికి గురిచేసిందని అన్నాడు.
"ఈ దశాబ్దంలో టీ20ల గురించి మాట్లాడాలంటే.. భారత్ పెద్దగా సాధించింది ఏమీ లేదు. ధోనీ కూడా అంతగా రాణించలేదు. మనం అత్యత్తమ టీ20 జట్టును తయారు చేస్తున్నాం. అందులో బట్లర్ లాంటి క్రికెటర్లు లేకపోవడం ఏంటి?"
-ఆకాశ్ చోప్రా, మాజీ క్రికెటర్
గతవారం ధోనీ కెప్టెన్‌గా దశాబ్దపు టీ20 జట్టును ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). మహీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది భారత్. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచినా.. అది ప్రస్తుత అవార్డుల కాలపరిధిలోకి రాదు.
కెరీర్లో 98 టీ20లాడిన ధోనీ.. 1617 పరుగులు చేశాడు. ఇతడితో పాటు మరో ముగ్గురు భారత క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు లభించింది.
దశాబ్దపు టీ20 జట్టు:
రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), పొలార్డ్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ