యూఏఈలో ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ గురించి బీసీసీఐ ప్రత్యేక జనరల్ సమావేశంలో(BCCI SGM) చర్చించనున్నారు. శనివారం వర్చువల్ విధానంలో జరగనున్న ఈ భేటీలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్ పాలకమండలి అధ్యక్షుడు బ్రిజేశ్ పటేల్ తదితరులు పాల్గొనున్నారు. దీనితో పాటే టీ20 ప్రపంచకప్(T20 WORLD CUP) జరపడం, రంజీ క్రికెటర్లకు పరిహారం ఇచ్చే అంశాలతో పాటు రానున్న సీజన్ నిర్వహణ గురించి ముఖ్యంగా చర్చించనున్నారు.
యూఏఈలో ఐపీఎల్
దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఐపీఎల్(IPL) మిగిలిన మ్యాచ్‌ల్ని యూఏఈలో సెప్టెంబరు 18-20 మధ్యలో మొదలుపెట్టి.. అక్టోబరు 10వ తేదీలోపు ముగించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఇంగ్లాండ్ పర్యటన పూర్తి చేసుకుని భారత క్రికెటర్లు వచ్చేస్తారు కానీ విదేశీ ప్లేయర్లను తీసుకువచ్చే విషయం గురించి ఎస్‌జీఎమ్‌లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు రారని తేలిపోగా, ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చేది అనుమానంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ క్రికెటర్లను భర్తీ చేయడం సాధ్యమయ్యే పనేనా అనేది ప్రశ్నగా మారింది.
టీ20 ప్రపంచకప్ ఎక్కడ?
అక్టోబరులో మన దేశంలో టీ20 ప్రపంచకప్(T20 WORLD CUP) జరగాల్సి ఉంది. సరిగ్గా ఆ సమాయానికి భారత్‌లో మూడో వేవ్(COVID THIRD WAVE) పొంచి ఉందనే హెచ్చరికలు నేపథ్యంలో వేదిక మార్చడం గురించి శనివారం భేటీలో మాట్లాడుకోనున్నారు. ప్రత్యామ్నయ వేదికగా యూఏఈకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధికారులు దీని గురించి ఏం చర్చిస్తారో చూడాలి.
రంజీ క్రికెటర్లకు పరిహారం
గతేడాది దేశవాళీ సీజన్ రద్దు కావడం వల్ల దాదాపు 700 మంది రంజీ క్రికెటర్లు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారికి పరిహారం అందజేయాలని బీసీసీఐ జనవరిలోనే నిర్ణయించింది. కానీ దానిని ఎలా ఇవ్వాలి అనే విషయం గురించి కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.
ఇది చదవండి: ఐపీఎల్ కోసం బీసీసీఐ విశ్వప్రయత్నాలు.. ఎందుకు?