Azharuddin on Rohit Sharma: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ జట్టు పగ్గాలను అందుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కేవలం టెస్టు జట్టుకు మాత్రమే నాయకత్వం వహిస్తాడు. ఈ క్రమంలో రోహిత్ నియామకంపై ఇప్పటికే పలువురు మాజీలు ప్రశంసలు కురిపించారు. సెలెక్షన్ కమిటీ మంచి నిర్ణయం తీసుకుందని అభినందించారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'విరాట్ కోహ్లీ తర్వాత నూతన సారథిగా ఎంపికైన రోహిత్ శర్మపై భారీ ఆశలు, అంచనాలు ఉంటాయి. అలానే జట్టును నడిపించే సామర్థ్యం రోహిత్‌కు ఉందని నా నమ్మకం. కొత్త సారథికి శుభాకాంక్షలు' అని పోస్ట్ చేశాడు.
ఇద్దరు సారథుల నియామకంపై బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకుందని మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ అభినందించాడు. అలానే భవిష్యత్తు కెప్టెన్ ఎవరనేదానిపైనా సెలక్టర్లు దృష్టిసారించాలని సూచించాడు.
"సరైన సమయంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. ఆటగాడిగా రోహిత్ ఎంతో మెరుగ్గా రాణించాడు. తన సారథ్య బాధ్యతల కోసం వేచి ఉన్నాడు. ఇప్పటికే కెప్టెన్‌గా ఎంతో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబయిని ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన పనితీరు కనబరిచాడు. ఈ నిర్ణయంతో తన భుజాలపై ఉన్న ఒత్తిడి తగ్గించినట్లే. ఇక నుంచి టెస్టు క్రికెట్ మీద కోహ్లీ.. వన్డే, పొట్టి ఫార్మాట్ల మీద రోహిత్ మరింత ఏకాగ్రత పెట్టే అవకాశం ఉంది"
--వెంగ్‌సర్కార్, మాజీ చీఫ్ సెలెక్టర్.
డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు పవర్‌సెంటర్‌లు అవుతాయనే వాదనను వెంగ్‌సర్కార్ తోసిపుచ్చాడు. ఇంగ్లాండ్ జట్టును తీసుకుంటే జో రూట్, ఇయాన్ మోర్గాన్ కూడా తమ జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారని ఉదహరించాడు. అదే విధంగా కోహ్లీ, రోహిత్ సమన్వయం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కోహ్లీ స్థానంలో రోహిత్‌ను ఎలా నియమించారనే దానిపై ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. తెల్లబంతి క్రికెట్‌లో రెండు ఫార్మాట్ల జట్లకు వేర్వేరు సారథులు ఉండటం సరికాదని సెలెక్టర్లు భావించినట్లు పేర్కొన్నాడు. "బీసీసీఐ ముందు టీ20 జట్టు సారథ్యం నుంచి తప్పుకోవద్దని సూచించింది. దానికి విరాట్ అంగీకరించలేదు. అయితే వన్డే, టీ20 ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండకూడదని సెలెక్టర్లు భావించారు. అందుకే విరాట్ కోహ్లీని టెస్టు సారథిగా కొనసాగిస్తూ.. మిగతా రెండు ఫార్మాట్లకు రోహిత్‌ను నియమించాం. వ్యక్తిగతంగా నాతోపాటు సెలెక్టర్లు విరాట్‌తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపాడు.
ఇదీ చదవండి: