శ్రీలంక వేదికగా జూన్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు సీఈఓ యాష్లే డిసిల్వా వెల్లడించారు. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ కష్టమని ఆయన పేర్కొన్నారు.
"కొవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆసియా కప్ నిర్వహించడం కష్టం. అందుకే జూన్‌లో జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేస్తున్నాం," అని డిసిల్వా తెలిపారు.
నిజానికి పాకిస్థాన్‌లో జరగాల్సిన ఈ ఆసియా కప్ వేదికను శ్రీలంకకు తరలించారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల టీమ్ఇండియా ఆటగాళ్లు పాక్‌లో పర్యటించడానికి సుముఖుత వ్యక్తం చేయకపోవడం ఇందుకు కారణం. దీంతో టోర్నీ వేదికను మార్చారు నిర్వాహకులు.
చివరగా ఆసియా కప్ 2018లో జరిగింది.
దీనిపై జై షా నేతృత్వంలోని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఆసియా కప్‌లో పాల్గొనాల్సిన అన్ని జట్లు తమ క్రికెట్ క్యాలెండర్‌ను రెండేళ్లకు నిర్ణయించాయి. దీంతో, 2023 ప్రపంచకప్ తర్వాత మాత్రమే ఆసియా కప్‌ను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: 'అందుకే డివిలియర్స్ జట్టులోకి రావట్లేదు'