U19 Women World Cup : దేశంలో పురుషుల క్రికెట్‌కు ఎప్పట్నుంచో ఆదరణ ఉన్నా.. అసలైన ఊపు వచ్చింది మాత్రం 1983 వన్డే ప్రపంచకప్ విజయంతోనే. భారత క్రికెట్‌ను ఆ టోర్నీకి ముందు, తర్వాత అని విభజించి చూడొచ్చు. ఆ విజయం తర్వాత దేశంలో క్రికెట్‌కు ఆదరణ అమాంతం పెరిగింది. క్రికెట్ మైకంతో తర్వాతి తరాలు ఊగిపోయాయి. ఆట ఏదైనా సరే.. ప్రపంచ విజేతగా నిలిస్తే అభిమానుల్లో వచ్చే ఉత్సాహమే వేరు. పదేళ్ల కిందటితో పోలిస్తే మహిళల క్రికెట్ ఎంతో మెరుగుపడ్డా, ఆదరణ కూడా ఎన్నో రెట్లు పెరిగినా.. పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మాత్రం అంతరం చాలా ఎక్కువే. ఆ అంతరాన్ని తగ్గించే అవకాశం ఇప్పుడు ముందుంది. ఒకప్పటితో పోలిస్తే క్రికెట్లోకి అమ్మాయిలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దేశంలో ప్రపంచ స్థాయి క్రికెటర్లు తయారవుతున్నారు. మహిళల క్రికెట్లో ఎప్పట్నుంచో ఆధిపత్యం చలాయిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లకు దీటుగా మన అమ్మాయిలు నిలుస్తున్నారు. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలి వర్మ, దీప్తి శర్మ లాంటి క్రికెటర్లు ఎవరికీ తీసిపోరు. ఇప్పుడు అండర్-19 ప్రపంచకప్‌తో మరికొందరు ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చారు. పార్శవి చోప్రా, అరుంధతి దేవి, తితాస్ సాధు, శ్వేత సెహ్రావత్, సౌమ్య తివారి, గొంగడి త్రిష ఈ టోర్నీలో తమ నైపుణ్యాలను చాటుకున్నారు. ప్రత్యర్థి జట్టు ఎలాంటిదైనా అదరకుండా బెదరకుండా దూకుడుగా ఆడి గెలవడం యువ క్రికెటర్ల ప్రత్యేకతను చాటిచెబుతుంది. ఈ దృక్పథమే మేటి క్రికెటర్లుగా తయారవడానికి సూచిక. మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా మున్ముందు మరింతమంది ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకుంటారనడంలో సందేహం లేదు. యువ ప్రతిభావంతులు మరింతగా వెలుగులోకి రావడం ఖాయం. ఆ ప్రతిభను సానబట్టి సరైన దారిలో నడిపించడం కీలకం.
డబ్ల్యూపీఎల్ తోడైతే..
బీసీసీఐ ఆరంభిస్తున్న మహిళల ప్రిమియర్ లీగ్‌తో అతివల క్రికెట్లో గొప్ప మార్పు చూడబోతున్నామన్న అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. ఓవైపు సీనియర్ జట్టు నిలకడగా రాణిస్తుండగా.. తాజాగా యువ జట్టు అండర్-19 ప్రపంచకప్ గెలవడం శుభసూచకం. ఇప్పుడు మహిళల ఐపీఎల్ కూడా తోడైతే ఆట పరంగానే కాక ఆదాయ పరంగా మహిళల క్రికెట్ అత్యున్నత స్థాయిని అందుకోవడం ఖాయం. పురుషుల ఐపీఎల్ వచ్చాక క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వందల మంది కుర్రాళ్లు ఎలా బాగుపడ్డారో, ఎంతమంది యువ ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారో, ప్రపంచ క్రికెట్లో భారత్ ఎలా ఎదిగిందో అందరూ చూశారు. ఇప్పుడు మహిళల క్రికెట్లోనూ లీగ్ రాకతో ఇందులోనూ అలాంటి మార్పు చూస్తామన్న ఆశలు కలుగుతున్నాయి. లీగ్ రాకతో మహిళా క్రికెటర్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక భద్రత వస్తుంది. వాళ్లు స్వేచ్ఛగా ఆట ఆడే అవకాశం వస్తుంది. ఇక వివిధ దేశాల మేటి మహిళా క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూంను పంచుకోవడం.. మైదానంలో కలిసి.. ప్రత్యర్థులుగా ఆడడం కచ్చితంగా ఆట మెరుగుపడడానికి తోడ్పడుతుంది. డబ్ల్యూపీఎల్ వల్ల జాతీయ జట్టులో చోటు కోసం పోటీ పెరుగుతుంది. మరింతమంది నాణ్యమైన క్రికెటర్లు జట్టులోకి వస్తారు. వారిని సరిగ్గా నడిపించే వ్యవస్థ ఉంటే మహిళల క్రికెట్లో భారత్ బలమైన శక్తిగా మారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.