ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో ఈ సంవత్సరం జరగాల్సిన ఈ పోటీల్ని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ సీజన్‌కు ప్రత్యామ్నాయంగా 2024లో న్యూజిలాండ్‌లో పోటీలను నిర్వహిచాలన్న ప్రతిపాదనను బ్యాడ్మింటన్ ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించింది.
"ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్స్- 2020 పోటీని నిర్వహించకపోవడం మాకు బాధగా ఉంది. కొవిడ్ నిబంధనల వల్ల జనవరి 2021లో జరిగే ఈ పోటీ నిర్వహణ అసాధ్యంగా మారింది. ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్స్ కోసం ఆతిథ్యమిస్తున్న న్యూజిలాండ్ బ్యాడ్మింటన్, టోర్నీ నిర్వాహకులు, భాగస్వామ్య సంస్థలకు, న్యూజిలాండ్ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. 2024లో న్యూజిలాండ్‌లో మళ్లీ పోటీలు నిర్వహించి పురస్కారాన్ని అందిస్తాం"
-- థామస్ లాండ్, బీడబ్ల్యూఎఫ్ సెక్రటరీ జనరల్
సరైన నిర్ణయమే
జూనియర్- 2020 పోటీ రద్దుతో బ్యాడ్మింటన్ ప్రేమికులు నిరుత్సాహానికి లోనవుతారని అన్నారు న్యూజిలాండ్ బ్యాడ్మింటన్ చీఫ్.
"ఈ వార్తతో మేం చాలా బాధపడ్డాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే సరైనది. ప్రపంచ బ్యాడ్మింటన్ ప్రేమికులంతా ఈ కార్యక్రమానికి హాజరై ఆటగాళ్ల ప్రదర్శనను చూడాలనుకున్నారు. కానీ ఈ నిర్ణయం వాళ్లను కాస్త నిరుత్సాహానికి గురి చేయొచ్చు"
-- జో హిచ్‌కాక్, న్యూజిలాండ్ బ్యాడ్మింటన్ ఛీఫ్
2021, 2022, 2023 ఛాంపియన్షిప్స్కు ఆతిథ్యమిచ్చే దేశాలను ఇప్పటికే ఎంపిక చేయగా.. 2024లో తిరిగి న్యూజిలాండ్‌కే అవకాశం ఇస్తామని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.
ఇదీ చూడండి:నవంబరు 1 నుంచి సాయ్ కేంద్రాల్లో శిక్షణ షురూ