థాయ్‌లాండ్ వైద్యులపై భారత్ బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశాడు. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి అక్కడి వెళ్లిన శ్రీకాంత్.. వైద్యులు సరైన రీతిలో కరోనా పరీక్ష చేయలేదని ఆరోపించాడు. టోర్నీ కోసం థాయ్‌లాండ్ చేరుకున్న తర్వాత నాలుగు సార్లు కొవిడ్ టెస్టు చేయించుకోగా.. సోమవారం జరిపిన పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ముక్కులో గాయమై రక్తం వచ్చినట్లు వెల్లడించాడు. దానికి సంబంధించిన ఫొటోలను శ్రీకాంత్ ట్విట్టర్లో పంచుకున్నాడు.
"మేము ఇక్కడికి మ్యాచ్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. మా రక్తాన్ని చిందించడానికి కాదు. ఇక్కడికి చేరుకున్నాక నేను నాలుగు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను. ఈ టెస్టులు చేసే విధానంలో నేను అసంతృప్తి చెందాను. దీన్ని నేను అంగీకరించను."
-కిడాంబి శ్రీకాంత్, భారత స్టార్ షట్లర్.
సోమవారం నుంచి ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్లోనే భారత్‌కు నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో చేతిలో ప్రపంచ మాజీ ఛాంపియన్ సింధు 21-16,24-26,13-21 తేడాతో పరాజయం చెందగా.. వంగ్చరొన్‌తో తలపడిన ప్రణీత్ 16-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. మరోవైపు కరోనా సోకిన కారణంగా సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ ఈ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
ఇదీ చూడండి : థాయ్‌లాండ్ ఓపెన్: తొలి రౌండ్లోనే సింధుకు షాక్