భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ టోక్యో ఒలింపిక్స్ అర్హత అవకాశం సందిగ్ధంలో పడింది. భారత్‌లో కరోనా విజృంభణ దృష్ట్యా ఇక్కడి నుంచి తమ దేశానికి వచ్చే విమానాలపై మలేషియా తాత్కాలిక నిషేధం విధించడమే అందుకు కారణం. దీంతో వచ్చే నెల 25న ఆరంభమయ్యే మలేషియా ఓపెన్‌లో భారత షట్లర్లు పాల్గొనే విషయంపై సందేహాలు మొదలయ్యాయి. ఈ టోర్నీలో సత్తాచాటి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉన్న సైనా, శ్రీకాంత్‌లపై పెను ప్రభావం పడనుంది.
ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ ప్రక్రియలో ఇదే చివరి ప్రధాన టోర్నీ. మహిళల, పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-16లో ఉన్న షట్లర్లే ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటారు. ప్రస్తుతం సైనా 22వ, శ్రీకాంత్ 20వ ర్యాంకులో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ నుంచి పీవీ సింధు, సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ జోడీకి మాత్రమే ఆ మెగా క్రీడలకు అర్హత సాధించే ర్యాంకింగ్ ఉంది.