ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న పెద్ద సవాలు కరోనా వైరస్ అని భారత షట్లర్ పీవీ సింధు వెల్లడించింది. ఈ సమస్యను అధిగమించాలంటే భౌతిక దూరం పాటించడం సహా పలు నియంత్రణ చర్యలు చేపట్టాలని చెబుతోంది. సుచిత్రా అకాడమీకి సంబంధించిన ఫిట్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న సింధు.. కొవిడ్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బలమైన రోగనిరోధక శక్తి పొందడానికి క్రీడలు, ఇతర శారీరక శ్రమ ముఖ్యమని ఈ సందర్భంగా పీవీ సింధు స్పష్టం చేసింది. వ్యాయామాల వల్ల మెదడు నుంచి రసాయనాలు విడుదలై.. మంచి నిద్రను ఇస్తుందని తద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందని వెల్లడించింది.
సుచిత్రా అకాడమీ తనకు రెండో ఇల్లు లాంటి ప్రదేశమని చెప్పింది. బ్యాడ్మింటన్లో తన ఎదుగుదలకు అకాడమీ తనకు ఎంతగానే సహాయపడిందని ఈ సందర్భంగా సింధు గుర్తుచేసుకుంది. తాను సాధించిన విజయాలకు అకాడమీకి చాలా రుణపడి ఉంటానని తెలిపింది.