ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ క్రీడారంగాన్నీ కుదిపేస్తోంది. క్రీడాకారులు ఆందోళన చెందుతున్న కారణంగా ఈ నెల 25 నుంచి ఆరంభం కావాల్సిన చైనా మాస్టర్స్‌ను నిర్వాహకులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చైనా దక్షిణ ప్రాంతంలోని హైనన్ ద్వీపంలో ఈ పోటీలు జరగాల్సి ఉంది. అత్యవసర ఆరోగ్య పరిస్థితి, రక్షణ, క్రీడా సామగ్రి రవాణాను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం టోర్నీని వాయిదా వేయడం మంచిదేనని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే చాలామంది క్రీడాకారులు పోటీ నుంచి తప్పుకున్నారని వెల్లడించింది.
చైనాలోని వుహాన్‌లో తొలుత వ్యాపించిన కరోనా వైరస్ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 259 మంది మరణించారు. దాదాపు 25 దేశాలకు వైరస్ వ్యాపించిన కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితిని ప్రకటించింది. కరోనాతో వణికిపోతున్న వుహాన్‌లోనే ఏప్రిల్‌లో ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో అక్కడ టోర్నీ నిర్వహణ కష్టమే. అయితే ఇప్పుడే టోర్నీపై నిర్ణయం తీసుకోవడం తొందరపాటే అవుతుందని నిర్వాహకులు అంటున్నారు. హైనన్‌లో జరగాల్సిన 2020 బ్లూబే టోర్నీని రద్దు చేశారు. మార్చి 30న బీజింగ్‌లో ఆరంభం కావాల్సిన ప్రపంచ స్నూకర్ పోటీలు కూడా వాయిదా పడ్డాయి.
ఇవీ చూడండి.. 'అప్పుడు ధోనీ.. ఇప్పుడు కోహ్లీ.. అలా చేయడం మంచిది కాదు'