దక్షిణాసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ జట్లు స్వర్ణాలను నెగ్గాయి. కిదాంబి శ్రీకాంత్ సారథ్యంలోని పురుషుల జట్టు ఫైనల్లో శ్రీలంక టీమ్‌ను 3-1 తేడాతో ఓడించి పసిడి కైవసం చేసుకుంది. మహిళల జట్టు కూడా తుదిపోరులో శ్రీలంకపైనే 3-0 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు దినుక కరుణరత్నేపై 17-21, 21-15, 21-11 తేడాతో విజయం సాధించాడు శ్రీకాంత్. అనంతరం సిరిల్ వర్మ.. సచిన్ ప్రేమాషన్పై 21-17, 11-5 తేడాతో నెగ్గి ఆధిక్యాన్ని పెంచాడు. మధ్యలో ప్రత్యర్థి రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
భారత డబుల్స్ జోడీ అరుణ్ జార్జ్ - సన్యామ్ శుక్లా .. 18-21, 21-14, 11-21 తేడాతో శ్రీలంక ద్వయం సచిన్- తరిందు ద్వయంపై ఓడింది. అయితే కృష్ణ ప్రసాద్ - ధ్రువ్.. మరో శ్రీలంక జోడీపై విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.
మహిళల ఫైనల్లో అస్మతా చలిహా, అకర్షి కశ్యప్, గాయత్రి గోపీచంద్ సింగిల్స్ విభాగంలో విజయం సాధించారు. ఫలితంగా 3-0 తేడాతో భారత మహిళల జట్టు గెలిచింది.
ఇదీచదవండి: ఈసారి ఐపీఎల్ వేలంలో 971 మంది క్రికెటర్లు