లాక్డౌన్ విధించడం వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపింది బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ). మార్చి 25 నుంచి లాక్డౌన్ విధించగా 27 నాటికి వీక్షకుల సంఖ్య 37 శాతం పెరిగింది. ప్రస్తుతం అందరూ ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఈ సంఖ్య భారీ స్థాయిలో పెరిగిందని తెలిపింది బీఏఆర్సీ. పురుషులు ఎక్కువగా ఇంట్లో ఉండడం ఇందుకు ముఖ్య కారణం అని వెల్లడించింది.
" లాక్డౌన్ అమలు జరగడం వల్ల అన్ని కుటుంబాలు ఇళ్లకే పరిమితమై టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రైమ్‌టైమ్ కాని సమయంలోనూ అధికంగా వీక్షిస్తున్నారు. లాక్డౌన్ ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య ఇంకా భారీగా పెరుతుందని భావిస్తున్నాం."
-- సునీల్ లుల్లా, చీఫ్ ఎగ్జిక్యూటివ్
మహిళల కంటే పురుషులే అధికం
మహిళలతో పోల్చితే పురుషులే అధికంగా టీవీ చూస్తున్నారు. ఈ కొవిడ్-19 గురించి సమాచారం తెలుసుకునేందుకు అధికంగా టీవీలకే అంటిపెట్టుకుంటారు. దేశవ్యాప్తంగా రోజుకు 62 మిలియన్ల మంది, వారంలో 1.20 ట్రిలియన్ల నిమిషాలు టీవీలు చూస్తున్నారు. రోజుకు 4 గంటల 40 నిమిషాల పాటు అదేపనిగా 622 మంది చూస్తున్నారు. కరోనా ప్రారంభానికి ముందు వార్తలు కేవలం 7 శాతం మంది చూడగా ఇప్పుడు 21 శాతానికి పెరిగింది.
ఆయా ఛానెళ్లు ఇలా
కొవిడ్ ప్రభావం వల్ల వారానికి న్యూస్ ఛానెళ్ల వీక్షకుల సంఖ్య 298 శాతం కాగా, బిజినెస్ న్యూస్ ఛానెళ్లు 180 శాతం, ఇన్ఫోటైన్మెంట్ 63 శాతం, సినిమాలు 56 శాతం పెరిగాయి. ఆధ్యాత్మిక ఛానెళ్ల వీక్షకుల సంఖ్య 26 శాతం మాత్రమే పెరిగింది. క్రీడలన్నీ నిలిచిపోవడం వల్ల స్పోర్ట్స్ ఛానల్స్ వృద్ధి తగ్గిపోయింది.
స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది
లాక్డౌన్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ఇది వరకు కేవలం 3.8 గంటలే గడిపేవారు ఇప్పుడు 12 గంటలు ఫోన్లతో ఉన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం అధికంగా ఉంది. ఆన్లైన్ షాపింగ్‌లు 38 శాతం తగ్గగా, ప్రయాణాలకు బుకింగ్‌లకు 53 శాతం, ఆహార పదార్థాల ఆర్డరింగ్ 41 శాతం, ఆన్లైన్ చెల్లింపులు 20 శాతం తగ్గాయి.
ఇదీ చదవండి: బ్యాంకింగ్ రంగంలో నష్టాలతో కోలుకోని స్టాక్‌మార్కెట్లు