చిత్రం: హిట్
నటీనటులు: విశ్వక్‌సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, నవీనా రెడ్డి, హరితేజ, శ్రీనాత్ మాగంటి, చైతన్య సగిరాజు తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: మణికందన్
కళ: అవినాష్ కొల్లా
కూర్పు: గ్యారీ బి.హెచ్
నిర్మాత: ప‌్రశాంతి త్రిపిర్నేని
సమర్పణ: నాని
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
సంస్థ: వాల్‌పోస్టర్ సినిమా
విడుదల:28-02-2020
కథానాయకుడిగానే కాదు.. నిర్మాతగానూ తన అభిరుచిని ప్రదర్శిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. కొత్త ప్రతిభని, కొత్త కథల్ని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు. అతడు నిర్మించిన తొలి సినిమా 'అ!' జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకుంది. రెండో ప్రయత్నంగా 'హిట్' సినిమా చేశాడు. 'ఫలక్‌నుమాదాస్'తో విజయాన్ని అందుకున్న విశ్వక్‌సేన్ ఇందులో కథానాయకుడు. స్నీక్‌పీక్ సన్నివేశంతో ప్రచారంలో కొత్త పంథాని అనుసరించడం వల్ల సినిమా విడుదలకి ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. మరి 'హిట్' చిత్రం ఎలా ఉంది? విశ్వక్‌సేన్ ఎలా నటించాడు? 'హిట్' ఫస్ట్ కేసు ఎలా నడిచింది?
కథేంటంటే: ప్రమాదాల్ని ముందే ఊహించి అరికట్టే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)కి చెందిన ఓ పోలీస్ అధికారి విక్రమ్ రుద్రరాజు (విశ్వక్‌సేన్). మానసికంగా ఒక సమస్యతో బాధపడుతుంటాడు. ఫలితంగా అతడిని గతం వెంటాడుతుంటుంది. కొన్నిరోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. ఇంతలోనే ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఆ వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న తన ప్రేయసి డాక్టర్ నేహా (రుహానీ) కూడా అదృశ్యమవుతుంది. అప్పుడు విక్రమ్ ఈ రెండు కేసుల్ని ఎలా ఛేదించాడు? అతడ్ని వెంటాడుతున్న గతం వెనక కథేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇది. ఇలాంటి కథాంశాలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే దర్యాప్తు అధికారి ఒక సమస్యతో సతమతమవుతూ.. కొత్త సవాళ్లని స్వీకరించడమే ఈ చిత్రం ప్రత్యేకత. విక్రమ్ గతానికి సంబంధించి ఉత్కంఠ కలిగించే విషాద సంఘటనతో చిత్రాన్ని ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత హీరోకున్న సమస్యను చూపించడం.. చిన్నచిన్న క్లూస్‌తో రెండు హత్య కేసులను చేధించే విధానంతో అతనికి ఉన్న శక్తియుక్తులను క్లుప్తంగా వివరించాడు.
>> వీటన్నింటి కన్నా క్లిష్టమైన సమస్య ప్రీతి మిస్సింగ్. ఇది అతను డ్యూటీలో లేని సమయంలో జరుగుతుంది. ఈ కేసును పరిష్కరించే క్రమంలోనే నేహా కూడా కనిపించకుండా పోయినట్లు తనకు అర్థమవుతుంది. ఈ విషయం తెలిశాక విక్రమ్‌కు దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని అర్థమవుతుంది. దాన్ని పరిశోధించే క్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. అవన్నీ కూడా కొత్త అనుమానాలకి దారితీస్తుంటాయి.
>> ఒక చిన్న అనుమానం, దాన్ని నిగ్గు తేల్చడం కోసం జరిగే పరిశోధన, ఆ తర్వాత దొరికే మరో కొత్త ఆధారం.. ఇలా కథ సాగుతుంటుంది. అసలు కథ జరుగుతున్న సమయంలోనే మధ్య మధ్యలో విక్రమ్ గతానికి సంబంధించిన సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తొలిసగం ఇన్వెస్టిగేషన్‌తోనే సాగుతుంది. విరామ సన్నివేశాలకి ముందు ఓ ఊహించని మలుపు వస్తుంది. అక్కడి నుంచి కథలో వేగం పెరగాల్సి ఉండగా, మళ్లీ ప్రథమార్ధం తరహాలోనే ఇన్వెస్టిగేషనే కొనసాగడం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ప్రీతి మృతదేహం దొరికాక డీఎన్‌ఏ పరీక్షల్లో వెల్లడయ్యే విషయాలు, దాని చుట్టూ ఏర్పడే అనుమానాలు ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురిచేస్తాయి.
>> ఆసక్తిని రేకెత్తించే చిక్కుముడులతో సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. కానీ, వీటిని ఒక్కొక్కటిగా విప్పి చూపించడానికి చాలా సమయం తీసుకున్నాడు. నేర పరిశోధన అంతా ఒక చోటే సాగడం వల్ల ప్రేక్షకులకు చూసిన సన్నివేశాన్నే మళ్లీ మళ్లీ చూసిన అనుభూతి కలుగుతుంటుంది. సినిమా మొత్తం సీరియస్‌గా సాగుతుండటం, క్రైమ్ థ్రిల్లర్ కావడం వల్ల వినోదానికి, పాటలకు ఎక్కడా ఛాన్స్ లేదు. ఆద్యంతం ఆసక్తిరేకెత్తించిన హీరో గతాన్ని సీక్వెల్ పేరుతో రివీల్ చేయకుండా వదిలేయడం ప్రేక్షకుల్లో ఓ అసంతృప్తిని మిగుల్చుతుంది.
ఎవరెలా చేశారంటే: నిజానికి ఈ కథలో చాలా పాత్రలే ఉన్నప్పటికీ సినిమా మొత్తం ఎక్కువగా విశ్వక్ చుట్టూనే తిరుగుతుంటుంది. కాబట్టి భాను చందర్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులున్నా వాళ్ల పాత్రలు నామమాత్రంగానే అనిపిస్తాయి.
>> ప్రియురాలిగా రుహానీ పాత్ర కేవలం అక్కడక్కడా రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితమైపోయింది. అయితే పోలీస్ ఆఫీసర్‌గా విశ్వక్ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. షీలాగా హరితేజ నటన ఆకట్టుకుంటుంది.
>> దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్‌కు సరిపడా కథను అందులో మలుపులను పక్కాగా రాసుకున్నప్పటికీ.. కథ ఒకే చోట సాగుతుండటం వల్ల కథనంలో వేగం కనిపించదు. అందువల్ల సాగతీతగా చూపించాడనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. దీనికి తోడు ముగింపు కూడా సాధారణంగా అనిపిస్తుంది. ఎస్.మణికందన్ ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
బలాలు:
- + విశ్వక్‌సేన్ నటన
- + నేర పరిశోధన
- + కథలో మలుపులు
బలహీనతలు:
- - అక్కడక్కడా సాగతీతగా అనిపించే సన్నివేశాలు
చివరిగా: థ్రిల్లర్ కథల్ని ఇష్టపడేవాళ్లకి నచ్చే 'హిట్'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!
- " class="align-text-top noRightClick twitterSection" data="">